ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్‌ను సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా జానీ కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన లడఖ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. మరికొందరు ఆయన చెన్నైకి వెళ్లిపోయారని కూడా చెబుతూ వచ్చారు. అయితే.. బెంగళూరులో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు.
ప్రస్తుతం బెంగళూరు నుంచి జానీని హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఇదిలావుంటే.. 21 ఏళ్ల మహిళా కొరియో గ్రాఫర్ జానీపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. తొలుత రాయదుర్గం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తనపై పలుమార్లు లైంగిక దాడి చేశారని.. బెదిరించారని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. తన విధుల్లోనూ ఆటంకలిగించారని తెలిపారు. అవకాశం దక్కకుండా పోతాయన్న ఉద్దేశంతో మౌనంగా భరించినట్టు తెలిపారు.
ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు.. మంగళవారం సాయంత్రమే కేసు నమోదు చేశారు. అనంతరం.. దీనిని నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసులో ప్రధానంగా పోక్స్ తదితర కీలక చట్టాలను ప్రయోగించారు. మరోవైపు.. జనసేన పార్టీనాయకుడిగా ఉన్న జానీని ఆ పార్టీ దూరంపెట్టింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదంటూ.. స్పష్టం చేసింది. ఇప్పుడు ఏకంగా జానీని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఈ కేసులో జానీకి ముందస్తు బెయిల్ లభించే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది.