బంగళా అమ్మినా విడుదల కాని సినిమా

ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కంగనా రౌనత్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన సినిమా ఎమర్జెన్సీ సెన్సార్ అడ్డంకులు దాటుకున్నా విడుదలకు మాత్రం మోక్షం దక్కించుకోవడం లేదు.

ఎలాగైనా దీన్ని నిషేధింపజేయాలని చూస్తున్న కొన్ని వర్గాలు తన చిత్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్న కంగనా స్వయంగా ఒక నియోజకవర్గానికి ఎంపి అయినప్పటికీ ఇలాంటి సమస్యను ఎదురుకోవడం అనూహ్యం. రిలీజ్ జాప్యం వల్ల ముంబైలోని ఖరీదైన బంగాళా అమ్మేశానని చెబుతున్న కంగనా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లకు రాకుండా ఎమర్జెన్సీని ఆపలేరని అంటోంది.

ఇంతగా కాంట్రావర్సి రేగడానికి పలు కారణాలున్నాయి. ఇందిరా గాంధీ విధించిన అత్యయక పరిస్థితి సమయంలో దేశంలో తలెత్తిన తీవ్ర అలజడులు, వివాదాస్పద సంఘటనలు, వ్యక్తుల గురించిన ప్రస్తావన ఇందులో చాలా ఉంది.

పైగా మాజీ ప్రధానిని హత్య చేసిన బాడీ గార్డులు పంజాబ్ సింగ్ వర్గానికి చెందిన వాళ్ళు కావడం చేత ఇప్పుడీ అంశాన్ని చూపించడం మనోభావాలను దెబ్బ తీసినట్టు అవుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఖలిస్థానీ నేత కింద్రన్ వాలేనుని ఉగ్రవాదిగా చిత్రీకరించడం పట్ల వస్తున్న అబ్జెక్షన్ కు స్పందిస్తూ అతను టెర్రరిస్టేనని కంగనా నొక్కి వక్కాణిస్తోంది.

చూస్తుంటే ఎమర్జెన్సీ ప్రకంపనలు బలంగా ఉండేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దీన్ని విడుదల చేయకుండా చూస్తున్నారని బిజెపి ఆరోపిస్తుండగా చరిత్రలో లేనివి కల్పించి చూపిస్తున్నారని హస్తం గుర్తు మద్దతుదారులు భగ్గుమంటున్నారు.

ఈ వివాదం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో అంతు చిక్కడం లేదు. అంతా సవ్యంగా ఉంటే సెప్టెంబర్ 5 ఎమర్జెన్సీ రిలీజయ్యేది. ఇప్పుడు ఫలానా డేట్ కి వస్తుందా లేదానేది కంగనా చెప్పలేకపోతోంది. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేయబోతున్న ఈ హిస్టారిక్ డ్రామా మీద వివిధ రాష్ట్రాల్లోని పలు కోర్టుల్లో కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి.