దేవర విధ్వంసం.. మూడు గంటలు

ఇప్పుడు తెలుగు అనే కాదు.. మొత్తంగా భారతీయ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం.. దేవర. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజే ఉంది. హిందీలో కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఈ సినిమాను రిలీజ్ చేస్తుండడంతో అక్కడా మంచి మార్కెటింగే జరుగుతోంది. సెప్టెంబరు 27న ఇండియన్ బాక్సాఫీస్‌ను ఈ సినిమా షేక్ చేస్తుందనే అంచనాలున్నాయి.

ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. సినిమాకు ఓపెనింగ్స్ విషయంలో ఢోకా ఉండదని.. కొరటాల శివ ఈ సారి తన కసినంతా చూపిస్తాడని.. బ్లాక్ బస్టర్ అందిస్తాడని తారక్ అభిమానులు ఆశాభావంతో ఉన్నారు. ఐతే ఈ సినిమా నిడివి పరంగా కొంత రిస్క్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఏకంగా మూడు గంటల పాటు ప్రేక్షకులు థియేటర్లో కూర్చోవాల్సి ఉంటుంది.

విడుదలకు రెండు వారాల ముందే ‘దేవర’కు సెన్సార్ పూర్తి చేశారు. నాలుగు కట్స్‌తో ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేశారు. రన్ టైం 2 గంటల 58 నిమిషాలు అని వెల్లడైంది. విషయం ఉంటే.. నిడివి అన్నది పెద్ద సమస్య కాదు. ఇటీవల ‘కల్కి’ దాదాపు మూడు గంటల నిడివితోనే మెప్పించింది. గత ఏడాది ‘యానిమల్’ దాదాపు మూడున్నర గంటల రన్ టైంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కోవలో చెప్పడానికి చాలా సినిమాలే ఉన్నాయి.

ఐతే సినిమాలో కంటెంట్ వీక్‌గా ఉంటే నిడివి అన్నది పెద్ద సమస్య అయిపోతుంది. రిలీజ్ తర్వాత కోతలు వేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి అన్నీ చూసుకునే కొరటాల అండ్ కో ఈ రన్ టైంను ఫైనల్ చేసి ఉంటుందని భావించాలి. ఈ చిత్రాన్ని కొరటాల మిత్రుడు మిక్కిలినేని సుధాకర్, తారక్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన సంగతి తెలిసిందే.