సెప్టెంబర్ 27 దేవర విడుదల కోసం బయ్యర్లు, ప్రేక్షకుల్లో ఎంత హైప్ ఉందో తెలిసిందే. అందుకే దానికి వారం ముందు తర్వాత వీలైనంత తమ కొత్త సినిమాల రిలీజ్ లేకుండా నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. కానీ కార్తీ మాత్రం ఏకంగా ఫేస్ టు ఫేస్ క్లాష్ కు సిద్ధపడుతున్నాడు. తన తాజా చిత్రం మెయిజగన్ ని తెలుగులో సత్యం సుందరం పేరుతో డబ్బింగ్ చేసి దేవర వస్తున్న రోజే థియేటర్లకు తీసుకొస్తున్నారు. సురేష్ ఏషియన్ పంపిణి కావడంతో చెప్పుకోదగ్గ థియేటర్లే దొరుకుతాయి. ఖైదీ నుంచి కార్తీకి మన దగ్గర మంచి మార్కెటే ఏర్పడింది. ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు.
అయితే దేవరతో తలపడేంత సీన్ సత్యం సుందరంకు ఉందా అనేదే ప్రశ్న. అలాని ఇదేదో ఆషామాషీ బొమ్మ కాదు. విజయ్ సేతుపతి త్రిషలతో 96 రూపంలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఇచ్చిన ప్రేమ్ కుమార్ దీనికి దర్శకుడు. ఆయనే శర్వానంద్ సమంతాతో రీమేక్ చేశారు కానీ మన ఆడియన్స్ తిరస్కరించడం వేరే విషయం. అయితే సత్యం సుందరం విషయంలో ప్రేమ్ కుమార్ చాలా ధీమాగా ఉన్నాడు. అరవింద్ స్వామి మరో కీలక పాత్ర పోషించిన ఈ విలేజ్ డ్రామా కథ మొత్తం ఒకే రాత్రిలో జరుగుతుందట. ఊహించని చాలా అంశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని అంటున్నారు.
ఇంకో వారంలో దీనికి సంబంధించిన ప్రమోషన్లను హైదరాబాద్ లో మొదలుపెట్టబోతున్నారు. దేవర ఫీవర్ లో సత్యం సుందరం నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. కంటెంట్ బాగుండొచ్చు కానీ అంత పెద్ద మాస్ మూవీతో తలపడటం ఎంతైనా రిస్కే. మన సంగతి కాసేపు పక్కనపెడితే తమిళనాడులో దేవర స్క్రీన్లకు ఈ సత్యం సుందరం ఒరిజినల్ వెర్షన్ కొన్ని కోత వేయడం ఖాయం. కేరళలోనూ కార్తీకి మార్కెట్ ఉంది. ఎలాగూ దసరాకు రజనీకాంత్ వెట్టయన్ ఉంది కనక కార్తీ నిర్మాతలు వేరే ఆప్షన్ లేక దేవరతో ముఖాముఖీకే సిద్ధపడ్డారు. నలుగుతుందా నిలబడుతుందా చూడాలి.