శనివారం.. అక్కడ సేఫ్ అయిపోయింది

ఓవైపు డివైడ్ టాక్, ఇంకో వైపు భారీ వర్షాలు.. అయినా సరే ఉన్నంతలో మెరుగైన వసూళ్లే రాబడుతోంది ‘సరిపోదా శనివారం’ చిత్రం. వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి ఇప్పటికే రూ.50 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వసూళ్లు చాలా గొప్ప అనే చెప్పాలి. మూడో రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పోరాడాల్సి వస్తోందీ చిత్రం. శని, ఆదివారాల్లో వర్షాలు ఏపీ, తెలంగాణను ముంచెత్తాయి.

ఏపీలో అయితే ఆదివారం పరిస్థితి ఘోరంగా ఉంది. వర్షాలే లేకుంటే ఈ చిత్రం వీకెండ్ అయ్యేసరికి సేఫ్ జోన్లోకి వచ్చేసేది. కనీసం పది కోట్ల మేర వసూళ్లలో కోత పడి ఉంటుంది వర్షాల వల్ల. వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి.. అలాగే వచ్చే వీకెండ్లో రానున్న సినిమాల టాక్ ఎలా ఉంటుంది అన్నది ‘సరిపోదా శనివారం’ హిట్ స్టేటస్ అందుకుంటుందా లేదా అన్నది తేలుస్తాయి. ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.40 కోట్ల మేర షేర్ రాబట్టాల్సి ఉంది.

ఐతే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ యుఎస్‌లో మాత్రం ‘సరిపోదా శనివారం’ చిత్రానికి ఢోకా లేకపోయింది. వీకెండ్ అయ్యేలోపే ఈ సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. శనివారం రన్ పూర్తయ్యేసరికే ‘సరిపోదా శనివారం’ 1.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రాన్ని యుఎస్‌లో రిలీజ్ చేసిన బయ్యర్ సేఫ్ అయిపోయాడు. ఆదివారం నుంచి వచ్చే వసూళ్లన్నీ లాభాలే.

ప్రిమియర్స్ నుంచే ఈ చిత్రం అక్కడ స్ట్రాంగ్‌గా నడుస్తోంది. ప్రిమియర్స్‌తో కలిపి తొలి రోజే 1 మిలియన్ మార్కును టచ్ చేసేసింది. తర్వాత కూడా కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. యుఎస్‌లో సినిమా సినిమాకూ నాని మార్కెట్ బలపడుతోంది. అతడికి మిలియన్ డాలర్లు అనేది కేక్ వాక్ అయిపోయింది. ‘సరిపోదా శనివారం’ ఈజీగానే 2 మిలియన్ మార్కును కూడా దాటేయబోతోంది.