సరిపోదా శనివారంలో పోలీస్ ఆఫీసర్ దయాగా విలన్ పాత్ర పోషిస్తున్న ఎస్జె సూర్య గత రెండు మూడు వారాలుగా ప్రమోషన్ కోసం విస్తృతంగా తిరుగుతున్నాడు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే నాని కోసం వెసులుబాటు చేసుకుని మరీ అన్ని రాష్ట్రాలు రౌండ్ వేసి వచ్చాడు. అయితే చాలా ఇంటర్వ్యూలలో, తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజనీకాంత్ బాషా గురించి ప్రస్తావన తేవడం అభిమానుల దృష్టి దాటకుండా పోలేదు. బాహుబలి, ఇంద్ర, సమరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్స్ అన్నింటికి బాషానే స్ఫూర్తి అని, ఒక ఫార్ములా ఇచ్చిన ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయిందని చెప్పుకొచ్చారు.
ఇప్పుడీ సరిపోదా శనివారంలోనూ అలాంటి పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందనే హింట్ ఇవ్వకనే ఇచ్చారు. అయితే ఎస్జె సూర్య ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. అదేంటంటే అసలు బాషా కూడా ఒరిజినల్ కాదు. 1991లో అమితాబ్ బచ్చన్ నటించిన హమ్ అప్పట్లో సూపర్ హిట్ మూవీ. ఇందులో ఆయన పాత్ర పేరు టైగర్. పోర్ట్ ఏరియాలో స్నేహితుడిని చంపినందుకు విలన్ ని బజారుకీడ్చి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటాడు. కొన్నేళ్ల తర్వాత కుటుంబం కోసం తిరిగి తన వయొలెంట్ యాంగిల్ బయటికి తీసి దుర్మార్గుల భరతం పడుతుంటాడు.
ఇదే పాయింట్ ని తీసుకుని బాషాకు కొన్ని కీలక మార్పులు చేశారు దర్శకుడు సురేష్ కృష్ణ. హమ్ లో అమితాబ్ తమ్ముడుగా నటించిన రజనీకాంతే దాని విజయం చూసి ఇష్టపడి మరీ బాషాగా రాయించుకున్నారు. చాలా దగ్గరి పోలికలు రెండు సినిమాల్లోనూ కనిపిస్తాయి. సో బాషానే అన్నింటికీ మూలం అనే పాయింట్ ని పూర్తిగా సమర్ధించలేం. సరే ఇదంతా పక్కనపెడితే ఆ రేంజ్ లో ఎస్జె సూర్య చెప్పడం చూస్తుంటే సరిపోదా శనివారంలో నాని ఎన్నడూ చూడని మాస్ ఎలివేషన్స్ ఇందులో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. అదే నిజమైతే దసరాని మించిన బ్లాక్ బస్టర్ పడినట్టే.