క్యారెక్టర్, విలన్ రోల్స్ చేసే రావు రమేష్ హీరోగా సినిమా అంటే.. ఎందుకొచ్చిన ప్రయాస అన్నట్లే చూశారు జనాలు. కాస్త ఇమేజ్ ఉన్న హీరోలు సినిమాలు చేస్తేనే జనం థియేటర్లకు రావడం కష్టంగా మారిన ఈ రోజుల్లో రావు రమేష్ లీడ్ రోల్ అంటే ఏం చూస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కానీ సినిమాలో విషయం ఉంటే.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తే.. వాళ్లు కంటెంట్ కోసం థయిేటర్లకు వస్తారని ఇటీవలే కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ లాంటి చిన్న సినిమాలు రుజువు చేశాయి. ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’లో కంటెంట్ ఏ స్థాయిలో ఉంది అన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది కానీ.. ఈ లోపు ప్రోమోలు, పబ్లిసిటీతో ప్రేక్షకుల దృష్టిని ఈ చిత్రం బాగానే ఆకర్షిస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఎంటర్టైనింగ్‌గా ఉండి ఆడియన్స్‌లో ఆసక్తి పెంచాయి. విషయం ఉన్న సినిమాలాగే కనిపించింది.
రిలీజ్ ముంగిట ఈ చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీ కూడా వస్తోంది. సుకుమార్ సతీమణి తబితకు ఈ సినిమా నచ్చి ప్రెజెంటర్‌గా మారడంతో ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ దశ తిరిగిందని చెప్పొచ్చు.
ఆమె సుకుమార్‌కు చూపించడం, ఆయనకు నచ్చడం.. దీంతో సినిమాను తబిత ప్రెజెంట్ చేయడానికి ఒప్పుకోవడం.. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు తనతో పాటు అల్లు అర్జున్‌ను తీసుకురావడం బాగా ప్లస్ అయ్యాయి. సినిమా గురించి సుకుమార్ చెప్పిన మాటలతో అందరికీ ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’పై అందరికీ గురి కుదురుతోంది.
అల్లు అర్జున్ రాక, తన స్పీచ్‌తో సినిమాకు బోలెడంత పబ్లిసిటీ వచ్చింది సోషల్ మీడియాలో. ఇది ‘మారుతినగర్’ బుకింగ్స్‌కు కచ్చితంగా ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. మామూలుగా ఈ స్థాయి సినిమాలకు చాలినన్ని షోలు ఇవ్వరు. ఇచ్చిన షోలకు కూడా మినిమం టికెట్లు తెగక షోలు క్యాన్సిల్ అవుతాయి. కానీ ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’కు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రోమోల్లో ఉన్నంత స్ట్రైకింగ్‌గా సినిమా కూడా ఉంటే హీరోగా రావు రమేష్‌కు మంచి హిట్ పడబోతున్నట్లే.