దక్షిణాది మేటి నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. తెలుగులో ఆమె చేసిన తొలి చిత్రం ‘అలా మొదలైంది’లోనే తనెంత మంచి నటో అర్థమైంది. ఆ తర్వాత ఆమె ఎన్నో మంచి పాత్రలు చేసింది. తన సొంత భాష మలయాళంలో అయితే గొప్ప గొప్ప సినిమాలు చేసింది. ఆమె నట ప్రతిభ చూసి ఏదో ఒక రోజు జాతీయ అవార్డు అందుకుంటుందనే అనుకున్నారంతా. ఆ సమయం ఇప్పుడొచ్చింది.
తమిళ చిత్రం ‘తిరు చిత్రాంబళం’లో చేసిన శోభన పాత్రకు గాను ఆమె జాతీయ అవార్డు సాధించింది. ఐతే నిత్య ఇంతకంటే గొప్పగా నటించిన సినిమాలున్నాయి. ఉదాత్త కథాంశాలతో తెరకెక్కిన చిత్రాల్లో ఆమె అద్భుతంగా నటించింది. కానీ అలాంటి సినిమాలకు కాకుండా కమర్షియల్ టచ్ ఉన్న ‘తిరుచిత్రాంబళం’ సినిమాలో నటనకు అవార్డు ఇవ్వడం ఒకింత ఆశ్చర్యపరిచింది.
ఈ చిత్రానికి తనకు జాతీయ అవార్డు ఇచ్చారని చెబితే తాను కూడా నమ్మలేదని నిత్య వ్యాఖ్యానించడం విశేషం. “నేను నా తర్వాతి చిత్రానికి సంబంధించి నా ఇంట్లో చర్చల్లో ఉండగా ధనుష్ ఫోన్ చేసి నాకు జాతీయ అవార్డు వచ్చిందన్నాడు. నేను ముందు నమ్మలేదు. జోక్ చేస్తున్నాడని అనుకున్నా. తర్వాత నిజమని తెలుసుకున్నా. ఎంతో ఆనందం కలిగింది. ఇది ఏ జానర్ సినిమా, ఇది ఎలాంటి కథ అని చూడకుండా ఈ పాత్రకు నన్ను అవార్డు కోసం ఎంపిక చేసినందుకు జ్యూరీకి కృతజ్ఞతలు. జాతీయ అవార్డు గెలుచుకునేందుకు తగ్గ స్థాయి ఈ పాత్రకు లేదని కొందరు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు రొమాంటిక్ కామెడీ డ్రామాకు జాతీయ అవార్డు అవసరమా అంటున్నారు. కానీ ఇలాంటి కథలను రాయడం అంత తేలిక కాదు. ఇలాంటి సినిమాలకు కూడా అవార్డులు వస్తాయని శోభన పాత్ర రుజువు చేసింది” అని నిత్యా మీనన్ పేర్కొంది.