దేవరకు గాయం….ఆందోళన అక్కర్లేదు

ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డాడని సోషల్ మీడియా వర్గాల్లో ప్రచారం జరగడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ప్రశాంత్ నీల్ సినిమా ఓపెనింగ్ జరిగి గంటల వ్యవధిలోనే ఇలా కావడం పట్ల టెన్షన్ పడ్డారు. కొందరు ఇది తీవ్రమైందిగా పేర్కొంటూ ట్విట్లు చేయడంతో ఫ్యాన్స్ మరింత ఒత్తిడికి లోనయ్యారు. అయితే గాయం కలిగిన మాట వాస్తవమే కానీ ఖంగారు పడాల్సింది ఏమి లేదని తారక్ అఫీషియల్ టీమ్ నుంచి క్లారిటీ రావడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు. రెండు రోజుల క్రితం జిమ్ చేస్తుండగా మణికట్టుకి గాయమయ్యాక సత్వర చికిత్స తీసుకోవడంతో ముప్పు తొలగిపోయింది.

ఇది జరిగాక తారక్ దేవర పార్ట్ 1 చివరి రోజు షూటింగ్ లో పాల్గొన్నాడు. నిజానికి వాయిదా వేసే అవకాశమున్న ఇతర ఆర్టిస్టుల కాంబినేషన్ తో పాటు ముందే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ కావడం వల్ల బాధని భరించి సెట్లో అడుగు పెట్టాడు. సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర టీమ్ మీద చాలా ఒత్తిడి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్, ప్రమోషన్లు, ఈవెంట్లు, ట్రైలర్ లాంచ్ ఇలా బోలెడు కార్యక్రమాలు ప్రెజర్ పెంచుతున్నాయి. ఇలాంటి టైంలో షూట్ పోస్టుపోన్ అయితే నష్టం సంగతి తర్వాత జాప్యం పెరిగిపోతుంది. అందుకే జూనియర్ కొంచెం కష్టమనిపించినా సహకరించాడు.

సో తారక్ ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వొచ్చు. త్వరలోనే కోలుకుని వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాల్లో పాల్గొనబోతున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత దేవర పార్ట్ 2 మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడనేది అక్టోబర్ లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే రిలీజ్ మాత్రం 2026 లేదా ఆపై సంవత్సరం తప్ప అంతకన్నా ముందు ఉండదు. సోలో హీరోగా అయిదేళ్ల గ్యాప్ ని భరించిన తారక్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బిజినెస్ డీల్స్ ఒక్కొక్కటిగా ముగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను సితార సంస్థ స్వంతం చేసుకోవడంతో భారీ రిలీజ్ దక్కనుంది.