రెండేళ్ల నుంచి స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వారి అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఈ ట్రెండ్ తెలుగులోనే బాగా నడుస్తోంది. తమిళం నుంచి ఫ్యాన్స్ కొంత పోటీ ఇస్తున్నా మన వాళ్ల ముందు నిలవలేరనే చెప్పాలి. తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘మురారి’ సినిమాను రీ రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం జరిగిందో తెలిసిందే. ఈ వారం వచ్చిన కొత్త సినిమాలన్నీ కలిపి సాధించిన వసూళ్ల కంటే వీకెండ్లో ‘మురారి’ సాధించిన వసూళ్లే ఎక్కువ. ఇంకా కూడా ఆ చిత్రం స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది.
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజున ‘ఇంద్ర రీ రిలీజ్ ప్లానింగ్ జరుగుతోంది కానీ.. ఈ వారం క్రేజున్న సినిమాలు మూణ్నాలుగు రిలీజవుతుండడంతో దానికి థియేటర్ల సమస్య తప్పేలా లేదు. ఈ టైంలో చిరు బ్లాక్ బస్టర్ రిలీజ్ చేస్తే ఇబ్బందని తటపటాయిస్తున్నారు కూడా.
ఐతే నెలాఖర్లో మరో మాస్ హిట్ రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అదే.. మాస్. చిరుకు సంబంధించి ఇప్పటికే కొన్ని రీ రిలీజ్‌లు వచ్చాయి. మెగా అభిమానులకు కావాల్సినంత కిక్కు దొరికింది. వేరే టాప్ స్టార్ల ఫ్యాన్స్ కూడా కొన్ని చిత్రాలతో ఈ నోస్టాల్జిక్ ఫీలింగ్ పొందారు. కానీ నాగ్ ఫ్యాన్స్‌కే ఇంకా ఈ కిక్కు దొరకలేదు.
శివ లాంటి కొన్ని చిత్రాల రీ రిలీజ్ జరిగినా సరైన ప్లానింగ్ లేక అనుకున్నంతగా సౌండ్ లేకపోయింది. కానీ ‘మాస్’ రీ రిలీజ్ ప్లానింగ్ మాత్రం గట్టిగా చేస్తున్నారు. ఇది నాగ్ సొంత సినిమా కావడంతో అన్నపూర్ణ స్టూడియోస్ కూడా రంగంలోకి దిగుతోంది. మంచి ప్రింట్ తీసుకొస్తున్నారు. రిలీజ్ ప్లానింగ్‌లో అభిమానులతో కలిసి సాగుతున్నారు. ఇది థియేటర్లలో సెలబ్రేట్ చేయడానికి సరైన సినిమా కావడంతో నాగ్ ఫ్యాన్స్ మంచి ఊపులో ఉన్నారు. పెద్ద స్థాయిలో రిలీజ్ చేసి థియేటర్లను ఫుల్ చేసి అక్కినేని అభిమానుల సత్తా చూపించాలని వాళ్లు ఆశపడుతున్నారు.