ఆయనని మొదటిసారి కలిసినప్పుడు పేరు చెప్పుకున్నాను.
రెండేళ్ల తర్వాత రెండో సారి కలిసినప్పుడు మళ్లీ చెప్పుకున్నాను.
“ఎందుకు మళ్లీ చెప్తున్నారు. పోయినసారి కోదండిపాణి స్టూడియోలో చెప్పారు కదా. గుర్తుంది” అన్నారు.
ఆయన జ్ఞాపకశక్తికి మనసులోనే దండం పెట్టుకుని ఈ జన్మకిది చాలు అనుకున్నాను.
ఆయన తొలిసారి నా పాట పాడినప్పుడు ఈ జన్మకిది చాలు అనుకున్నాను.
ఇంకొన్నాళ్లకి ఒక కార్యక్రమంలో “సిరాశ్రీ!” అని ఆయనతో పిలిపించుకుని పలకరింపుని అందుకున్నప్పుడు ఈ జన్మకిది చాలు అనుకున్నాను.
పాడే ప్రతి పాటని సినిమా టైటిల్, రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడి పేర్లతో సహా స్వయంగా తన పుస్తకంలో రాసుకోవడం నాకు తెలిసి ఒక్క బాలుగారికే అలవాటు. అలా ఆయన పాటల పుస్తకంలో ఆయన చేత్తో నా పేరు రాసుకోవడం చూస్తున్నప్పుడు ఈ జన్మకిది చాలు అనుకున్నాను.
కానీ ఇప్పుడు ఎందుకో అవేవీ చాలట్లేదు అనిపిస్తోంది. ఇంకా కావాలనిపిస్తోంది సాధ్యం కాదని తెలిసినా.
ఆయనతో కలిపిన మాట, పాట ఆజన్మాంతం నాకు అపురూపమైన అనుభూతి. వారి కోదండపాణి స్టూడియోకి, వారి ఇంటికి వెళ్లడం, వారిపై నేను వ్రాసిన పద్యాలని వారికే వినిపించడం అన్నీ మరపురాని అనుభూతులే.
ఆయన నుంచి నేను గమనించిన, నేర్చుకుని తీరాలి అనుకునే మంచి విషయాలు:
— నిరంతరం సాధన చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం
— మనుషుల్ని పేర్లతో సహా గుర్తుపెట్టుకోవడం
— ప్రేమగా పలకరించడం
— ఎంత ఎదిగినా ఎదుటివారికి సమాన మర్యాదనివ్వడం
— వినయంతో జీవించడం
— సెన్సాఫ్ హ్యూమర్ ని వదలకపోవడం
— లైవ్లీగా, యాక్టివ్ గా ఉండడం
— వృత్తిని విపరీతంగా ప్రేమించడం
— ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ యువతతో పోటీ పడడం
— ఎవరి గురించీ నెగటివ్ గా మాట్లాడకపోవడం
— చేస్తున్న వృత్తిలో కొత్తవారిని ఎంకరేజ్ చేయడం
— ఓపికున్నంత వరకు నిర్విరామంగా పని చేయడం
— అంపశయ్య మీద కూడా నిరాశ చెందకుండా ఉండగలడం
పై వాటిలో 2వది గిఫ్టే అయినా, మిగతావన్నీ సాధనతో సాధించవచ్చు.
ఇంత అనుభూతిని, స్ఫూర్తిని ప్రసాదించిన మన ప్రియమైన బాలూ గారికి ఆత్మనమస్కారం చేస్తూ…
నా పద్యకుసుమం. 🙏🌹
………….
పండితారాధ్యుల వంశంబులో పుట్టె
శ్రీవాణి మురిపాల సిరులపట్టి;
వేవేల వైనాల వీనులన్ మురిపించె
తెలుగు జాతికి కీర్తి తెచ్చి పెట్టి;
పద్మసంభవురాణి వాత్సల్యమున్ పొంది
పద్మభూషణుడైన బాలుడితడు;
లింగాష్టకమున లాలింపగా హాయిగా
నటరాజు దిద్దిన నటుడితండు;
రాగ సంద్రమంత రసనాగ్రమున పొంగు
భాషలన్ని కులికి పరిఢవిల్లు;
తరతరాలు వినిన తరగనంతటి నిధి
ఇచ్చినాడు మనకు ఎస్పిబాలు.
— సిరాశ్రీ
This post was last modified on September 25, 2020 6:19 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…