టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ కొంచెం గ్యాప్ తర్వాత ఇటీవలే మళ్లీ బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమయ్యాడు. కానీ ఈసారి కూడా పాస్ మార్కులు పడలేదు. తన కొత్త చిత్రం ‘బడ్డీ’ దారుణంగా బోల్తా కొట్టింది. అసలే హైప్ లేని సినిమా. పైగా పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. బాక్సాఫీస్ దగ్గర కూడా ఉత్సాహభరితమైన వాతావరణం లేని సమయంలో రిలీజైంది. ఇంకేముంది మినిమం ఇంపాక్ట్ వేయకుండానే ఈ సినిమా కథ ముగిసింది. ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించాలన్న ఉద్దేశంతో రేట్లు తగ్గించి మరీ రిలీజ్ చేశారు.
ఐతే కంటెంట్ ఉన్న సినిమా అయితే రేట్లు తగ్గిస్తే ప్రయోజనం. కానీ అది లేనపుడు ఏం చేసినా లాభం ఉండదు. తొలి రోజు ‘బడ్డీ’ థియేటర్లలో కాస్త జనం కనిపించారు. కానీ రెండో రోజుకు సినిమా వెలవెలబోయింది.
శని, ఆదివారాల్లో కూడా ‘బడ్డీ’కి చెప్పుకోదగ్గ వసూళ్లు రాలేదు. ఆదివారం తర్వాత పూర్తిగా ఆశలు వదిలేసుకున్నట్లే అయింది. సినిమా ఫలితమేంటో తొలి రోజే తేలిపోవడంతో తర్వాత పబ్లిసిటీ గురించి టీంలో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. నిర్మాత జ్ఞానవేల్ రాజా సినిమాను పుష్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘తంగలాన్’ ప్రమోషన్ల కోసం ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన జ్ఞానవేల్ రెండు రోజుల కిందటే రిలీజైన తన చిత్రం ‘బడ్డీ’ ఊసే ఎత్తకపోవడాన్ని బట్టి ఈ సినిమా మీద ఆయన ముందే ఆశలు వదిలేసుకున్నారని అర్థమవుతోంది.
శిరీష్ సినిమాకు సినిమాకు గ్యాప్ తీసుకుని ఏదో కష్టపడుతున్నాడు కానీ.. సరైన సబ్జెక్ట్ ఎంచుకోకపోవడంతో అతడి రాత మారట్లేదు. ‘బడ్డీ’తో మరో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్న శిరీష్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈసారైన అల్లు అరవింద్, అల్లు అర్జున్, బన్నీ వాసు కొంచెం దృష్టిపెట్టి తన కోసం ఒక మంచి ప్రాజెక్టు సెట్ చేసి కెరీర్ పుంజుకునేలా చేస్తారేమో చూడాలి.