ఆన్ లైన్లో కొత్త సినిమాల పైరసీ చూసేవాళ్లకు బాగా సుపరిచితమైన పేరు తమిళ్ రాకర్స్. దీనికి ఎంత పాపులారిటీ ఉందంటే ఈ పేరు మీద ఏకంగా ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అయినా సరే ఈ భూతాన్ని కట్టడి చేయడం కానీ, దీని వెనుక సూత్రధారులను పట్టుకోవడం కానీ ఇప్పటిదాకా జరగలేదు. ఈ సైట్ లో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషలకు సంబంధించి దొంగ ప్రింట్లు పెడుతూనే ఉంటారు. ఎట్టకేలకు కేరళ పోలీసులు లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి, క్రైమ్ థ్రిల్లర్ తరహాలో అన్ని రకాల తెలివితేటలు వాడి ఒక ముఖ్యమైన దొంగను పట్టుకుని అరెస్ట్ చేశారు.
సలార్ విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ భార్య సుప్రియ మీనన్ కొద్దివారాల క్రితం ఒక సైబర్ కంప్లైంట్ ఇచ్చింది. భర్త నటించిన కొత్త చిత్రం గురువయుర్ అంబలనదియల్ థియేటర్లకు వచ్సిన రెండో రోజే పైరసీ బారిన పడిందంటూ ఫిర్యాదు చేసింది. డిజిటల్ ఫార్మట్ లో రిలీజ్ చేసిన క్యూబ్ సంస్థ తమ వాటర్ మార్కింగ్ టెక్నాలజీ వాడి రికార్డింగ్ జరిగింది కోచిలోని ఒక మల్టీప్లెక్స్ అని గుర్తించింది. దీంతో పక్కా వ్యూహం పన్నిన పోలీసులు ధనుష్ రాయన్ కు సెల్ ఫోన్ ద్వారా రికార్డింగ్ చేసుకోవడానికి వచ్చిన జేబ్ స్టీఫెన్ రాజ్(33 వయసు) తో పాటు అతని స్నేహితుల గ్యాంగ్ ని అరెస్ట్ చేసింది.
విచారణలో తేలింది ఏమిటంటే ఈ స్టీఫెన్ రాజ్ ప్రముఖ తమిళ రాకర్స్ కి సినిమాలు అందిస్తూ ఉంటాడు. మార్కెట్ లో లక్షకు పైగా ఖరీదు చేసే స్మార్ట్ ఫోన్ ద్వారా పైరసీకి పాల్పడటం ఇతని ప్రత్యేకత. తిరువనంతపురంలోని ఒక హోటల్ లో మాములుగా ఉద్యోగిగా కనిపించే స్టీఫెన్ రాజ్ థియేటర్ రికార్డింగ్ ద్వారా ప్రతి సినిమాకు వెబ్ సైట్ నుంచి 5 వేల రూపాయలు అందుకుంటాడట. ఏడాదిన్నరగా ఈ దందా కొనసాగుతోంది. మొత్తం 12 సభ్యులు ఈ బృందంలో ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఇతని ద్వారా మరిన్ని ముఖ్యమైన వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.