భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కొత్తది కాదు. కానీ డబ్బింగ్ మూవీకి అప్లికేషన్ పెట్టుకోవడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. గతంలో రజనీకాంత్ 2.0కి పెంచినప్పుడు దాని గ్రాండియర్ కు, అంచనాలకు ప్రేక్షకులు భారంగా ఫీలవ్వలేదు. కానీ భారతీయుడు 2కి నిర్మాతలు టికెట్ హైక్ అనుమతులు తెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మల్టీప్లెక్స్ టికెట్ మీద 75, సింగల్ స్క్రీన్ 50 రూపాయలు చొప్పున పెంచుకునే అవకాశంతో పాటు అదనంగా అయిదో ఆటకు పర్మిషన్ ఇచ్చింది.
నిజానికి భారతీయుడు 2 మీద భీభత్సమైన బజ్ లేదు. తమిళనాడులోనే బుకింగ్స్ నెమ్మదిగా ఉన్నాయి. టాక్ ఎక్స్ ట్రాడినరిగా వస్తుందనే టీమ్ నమ్మకం మీదే బిజినెస్ జరిగింది. అలాంటిది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ క్రేజ్ ఊహించుకోవడం కష్టం. మరి పక్కన ఏపీలో కూడా పెంపు అడిగారానేది తెలియాల్సి ఉంది. అడిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ వస్తుంది. అయితే ఇది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ పబ్లిక్ టాక్, రివ్యూలు రెండూ సినిమా అత్యద్భుతంగా ఉందని కితాబిస్తే ఏమో అనుకోవచ్చు కానీ యావరేజ్ అనిపించుకున్నా ఎదురీత తప్పేలా లేదు.
ఇక్కడే నెటిజెన్లు ఒక లాజిక్ తీస్తున్నారు. కల్కి 2898 ఏడి, బాహుబలి లాంటి సినిమాలు తమిళనాడులో రిలీజైనప్పుడు ఇలాగే మనకూ స్పెషల్ రేట్లు, బెనిఫిట్ షోలు ఇస్తారా అని. సమాధానం లేదనే చెప్పాలి. కానీ మన దగ్గర అలాంటి ఇబ్బందేమీ లేదు. స్ట్రెయిట్ అయినా అనువాదమైనా ఒకే రకమైన ట్రీట్ మెంట్ ఇచ్చి గౌరవిస్తారు. కోలీవుడ్ నిర్మాత జ్ఞానవేల్ రాజా అన్నట్టు తెలుగు జనాలు పక్క భాషల హీరోలను సైతం తమ స్వంత వాళ్ళలా ఫీలవుతారు. అదే తరహాలో ప్రభుత్వాలు కూడా ట్రీట్ చేస్తున్నాయి. అందుకే భారతీయుడు 2కి ఛాన్స్ దొరికింది. అధికారిక ఉత్తర్వులు ఏ క్షణమైనా రావొచ్చు.