చరణ్ అభిమానుల్లో టెన్షన్

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. రకరకాల కారణాల వల్ల ఈ చిత్రం అనుకున్న దాని కంటే చాలా ఆలస్యం అయింది. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఆలస్యం అయితే అయింది కానీ. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి చరణ్‌కు ఒక బ్లాక్‌బస్టర సక్సెస్ అందిస్తే చాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కానీ దీని కంటే ముందు శంకర్ నుంచి వస్తున్న ‘ఇండియన్-2’ ఔట్ పుట్ చూస్తే మాత్రం చరణ్ అభిమానులకు టెన్షన్ తప్పట్లేదు.

‘ఇండియన్-2’కు సంబంధించి ఇంతకుముందు వచ్చిన ప్రోమోలేవీ అంత ఎగ్జైట్మెంట్ కలిగించలేదు. లేటెస్ట్‌గా రిలీజైన ట్రైలర్‌కు కూడా మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఇండియన్’ మ్యాజిక్‌ను ఇది రిపీట్ చేయగలదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

సేనాపతి పాత్ర చిత్రణ.. దాని లుక్స్ ప్రేక్షకుల్లో రకరకాల సందేహాలకు కారణమయ్యాయి. ట్రైలర్లో ‘వావ్’ ఫ్యాక్టర్ మిస్ అయింది. ఈ సినిమా బాగా ఆడితే ఆశ్చర్యపోవాల్సిందే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ట్రైలర్ చూశాక చరణ్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ‘గేమ్ చేంజర్’కు సంబంధించి ఇప్పటిదాకా ఒక పాట తప్పితే ఏ ప్రోమోలు రిలీజ్ కాలేదు. ఆ సినిమా ఎలా ఉంటుందనే విషయంలో ఏ క్లారిటీ లేదు.

‘ఇండియన్-2’ చూశాక శంకర్ పనితనం మీద ఒక అంచనాకు రావొచ్చని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా బాగా ఆడాలని చరణ్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. కానీ ‘ఇండియన్-2’ ట్రైలర్ మాత్రం వారిలో అనేక సందేహాలు రేకెత్తించింది. ట్రైలర్‌ను మించి సినిమాలో చాలా విశేషాలు ఉంటాయని.. శంకర్ ఇన్నేళ్లు కష్టపడి తీసిన సినిమా ప్రత్యేకంగానే ఉంటుందని.. రిలీజ్ తర్వాత అందరి అభిప్రాయాలు మారతాయని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా రిజల్ట్ అటు ఇటు అయితే మాత్రం ఆ ప్రభావం ‘గేమ్ చేంజర్’ మీద పడుతుందనడంలో సందేహం లేదు.