సాధారణంగా థియేట్రికల్ రిలీజులకు ఎదురయ్యే కోర్టు వివాదం ఈసారి ఓటిటి సినిమాకు రావడం విచిత్రం కాగా అందులోనూ అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ తెరంగేట్రంకి ఇలా జరగడం ఇంకో ట్విస్టు. తమ మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ కొద్దిరోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ లో జరగాల్సిన స్ట్రీమింగ్ ని కొందరు హిందూ ప్రతినిధులు ఆపేశారు. వాదనలు విన్న గుజరాత్ కోర్టు స్వయంగా మూవీని చూసి చిన్న అభ్యంతరాలు తప్ప ఏమీ లేదని తీర్పు ఇచ్చింది. దీంతో ఎలాంటి హడావిడి లేకుండా నిన్న సైలెంట్ గా విడుదల చేశారు. ఇంత వివాదం చెలరేగిన మహరాజ్ లో నిజంగా అంత విషయముందో లేదో చూద్దాం.
1862లో జరిగిన మహరాజ్ లిబెల్ కేసు ఆధారంగా దర్శకుడు సిద్దార్థ్ పి మల్హోత్రా దీన్ని తెరకెక్కించాడు. జర్నలిస్ట్ గా సామజిక బాధ్యతను ఫీలయ్యే కర్షన్ దాస్ (జునైద్ ఖాన్) స్థానికులు దేవుడిగా కొలిచే జెజె అలియాస్ మహరాజ్ ( జైదీప్ ఆహ్లావత్ ) లోని రహస్య కోణాన్ని ప్రపంచానికి చెప్పాలని కంకణం కట్టుకుంటాడు. మతాన్ని అడ్డుపెట్టుకుని అమాయకులను, అమ్మాయిలను జేజే మోసం చేస్తున్న వైనాన్ని పేపర్ ద్వారా బహిర్గతం చేస్తాడు. దీంతో వ్యవహారం న్యాయస్థానం చేరుతుంది. పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయినా కర్షన్ దాస్ వ్యవస్థకు ఎదురు నిలిచి ఎలా గెలిచాడనేది మహరాజ్ అసలు కథ.
సౌరభ్ షా రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కిన మహరాజ్ ని సుప్రసిద్ధ యష్ రాజ్ ఫిలింస్ నిర్మించింది. నూటా యాభై ఏళ్ళ క్రితం నేపధ్యాన్ని తీసుకున్న సిద్దార్థ్ దాన్నిఆసక్తికరంగా మలచడంలో తడబడ్డాడు. జెజె అలియాస్ మహరాజ్ చీకటి ప్రపంచాన్ని ఒక విలేఖరి బయటికి తీయడమనే పాయింట్ లో మంచి వెయిట్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే బలహీనతల వల్ల నిస్సారంగా సాగుతుంది. కోర్టు రూమ్ డ్రామా బాగానే రాసుకున్నా ఇటీవలి కాలంలో ఇలాంటివి చాలా చూసేశారు కాబట్టి ఆడియన్స్ కి ఎలాంటి ప్రత్యేకత అనిపించదు. జైదీప్, శర్వారిలు మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగా జునైద్ జస్ట్ పర్వాలేదనిపించారు. ఇంత బిల్డప్ ఇచ్చిన మహరాజ్ చివరికి నిరాశనే మిగిల్చింది.