న్యాయం గెలవాలంటున్న ఈగ విలన్

కెజిఎఫ్ నుంచి స్థాయి పెరిగిందని సంబరపడుతున్న శాండల్ వుడ్ ని ప్రస్తుతం స్టార్ హీరో దర్శన్ కేసు తీవ్ర కుదుపులకు గురి చేస్తోంది. స్వంత అభిమానిని హత్య చేసిన అభియోగం మీద ప్రస్తుతం జైల్లో విచారణ ఎదురుకుంటున్న ఈ నటుడి వ్యవహారం మీద కన్నడ మీడియా భగ్గుమంటోంది. ముందు నుంచి వివాదాలకు నెలవుగా నిలుస్తున్న దర్శన్ కమర్షియల్ గా భారీ స్టామినా ఉన్న హీరో కావడం వల్ల గతంలో ఎన్నో వ్యవహారాలు చాపకింద నీరులా రాజకీయ ప్రమేయాలతో చల్లారిపోయాయి. కానీ ఈసారి అలా సాధ్యం కాకపోవడంతో రచ్చ చాలా దూరం వెళ్లిపోయింది. పొలిటికల్ ప్రెజర్ తెచ్చేందుకూ భయపడే పరిస్థితి నెలకొంది.

ఈ క్రమంలో దర్శన్ కో స్టార్, ఈగ విలన్ సుదీప్ స్పందించాడు. తమకు ఏం జరుగుతోందో తెలియదని, పోలీస్ స్టేషన్ కు వెళ్లి తెలుసుకునే వెసులుబాటు లేదు కాబట్టి మీడియా, సంబంధిత అధికారులు నిజాలు వెలికి తీసేందుకు కష్టపడుతున్న వైనం కనిపిస్తోందని అన్నారు. అంతే కాదు తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందేనని కోరుతూ, కొత్తగా పెళ్ళైన రేణుక స్వామి భార్యకు, ఆమె కడుపులో ఉండి భూమ్మీద రాని బిడ్డకు న్యాయం జరగాల్సిందేనని అన్నారు. ఎక్కడా దర్శన్ ని సమర్థిస్తూ కానీ కాసింత పాజిటివ్ గా కానీ ఎలాంటి కామెంట్స్ సుదీప్ చేయకపోవడం కేసులోని తీవ్రతని సూచిస్తోంది.

ఆధారాలు బలంగా ఉండటంతో దర్శన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎక్కడో చిత్రదుర్గలో ఉన్న రేణుకస్వామిని బెంగళూరు దాకా తీసుకొచ్చి ఒక షెడ్డులో గంటల తరబడి చిత్రహింస పెట్టి చంపేసిన వైనం ఏ క్రైమ్ సినిమాకు తీసిపోవడం లేదు. ఒకవేళ దర్శన్ ఘటన జరిగిన చోట లేకపోయి ఉంటే ఇంత సీరియస్ అయ్యేది కాదేమో కానీ సహనటి పవిత్ర గౌడతో కలిసి మరీ అక్కడికి వెళ్లి అతన్ని కొట్టడం ఇంత దూరం తీసుకొచ్చింది. కోట్లాది రూపాయలు పెట్టుబడితో ప్రొడక్షన్ లో ఉన్న దర్శన్ సినిమాల నిర్మాతలు మాత్రం లబోదిబోమంటున్నారు. నిర్దోషిగా అతను తేలకపోతే మాత్రం వీళ్లకు నరకమే.