సినిమా ప్రపంచంపై ‘రామోజీరావు’ సంతకం

ఈనాడు సంస్థల అధినేతగా మీడియా ప్రపంచంలో తిరుగులేని శకాన్ని సృష్టించడమే కాక పత్రికా ప్రపంచానికి గొప్ప స్ఫూర్తిగా నిలిచిన రామోజీరావు కన్నుమూయడం యావత్ తెలుగు ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే సినీ రంగం మీద సైతం ఆయన వేసిన ముద్రను ప్రస్తావించడం ఎంతైనా అవసరం.

1984లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ స్థాపించిన రామోజీరావు మొదటి చిత్రం ‘శ్రీవారికి ప్రేమలేఖ’తో అమోఘ విజయాన్ని అందుకుని టాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప క్లాసిక్ అందించారు. లెక్కలేనన్ని అవార్డులుతో పాటు కమర్షియల్ గానూ బ్లాక్ బస్టర్ అందుకుంది. సుప్రసిద్ధ నృత్యకారిణి సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తీసిన ‘మయూరి’ బయోపిక్కుల విషయంలో రామోజీరావు ముందుచూపుకు నిదర్శనం.

మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ‘ప్రతిఘటన’ ఒక చరిత్ర. మూస ఫార్ములాలో కొట్టుమిట్టాడుతున్న టాలీవుడ్ కు ఒక కొత్త జానర్ ని సృష్టించారు. బెంగళూరులో అయిదు వందల రోజులు ఆడటం ఎవరూ అందుకోలేని రికార్డు.

గిరిజన వాడలో జరిగిన నిజ జీవిత ఘటన ఆధారంగా తీసిన ‘మౌనపోరాటం’ మరో మెచ్చుతునక. నక్సలైట్ల ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో ఇటు వీళ్ళను అటు పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తూ తీసిన ‘పీపుల్స్ ఎన్కౌంటర్’ ఎన్ని వివాదాలు వచ్చినా జనం ఆదరించారు. హృదయాన్ని హత్తుకునే ‘అమ్మ’ ద్వారా బ్రహ్మానందంలోని సీరియస్ కోణాన్ని వెలికి తీసిన ఘనత ఆయనకే దక్కుతుంది. పరుగుల రాణి ‘అశ్విని’ కథని ఆమెతోనే తీసి శభాష్ అనిపించుకోవండ రామోజీరావు అభిరుచికి నిదర్శనం.

పిల్లలను అలరించే లక్ష్యంతో తీసిన ‘తేజ’ పెద్దలను మెప్పించింది. కొన్ని ఫ్లాపుల తర్వాత ఏం జరుగుతుందో సమీక్షించుకోవడానికి ఉషాకిరణ్ కు గ్యాప్ ఇచ్చిన రామోజీరావు 2000 సంవత్సరంలో దర్శకుడు తేజతో అతి తక్కువ బడ్జెట్ తీయించిన ‘చిత్రం’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

తరుణ్ ని హీరోగా పరిచయం చేస్తూ ‘నువ్వే కావాలి’ నెలకొల్పిన రికార్డులు స్టార్ హీరోలు బద్దలు కొట్టడానికి ఏళ్ళు పట్టింది. జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలనితో, కళ్యాణ్ రామ్ ని తొలిచూపులోనేతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది రామోజీరావే. 2015లో రాజేంద్రప్రసాద్ ‘దాగుడుమూతల దండాకొర్’ తర్వాత నిర్మాణానికి బ్రేక్ ఇచ్చారు. ఉత్తమ విలువలు పాటించిన సంస్థగా ఉషాకిరణ్ ని నిలపడంలో రామోజీరావుగారు చేసిన కృషి అసామాన్యం.