నవదీప్ కోసం రానా బిగ్ సర్ప్రైజ్

రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో నవదీప్ లవ్ మౌళి ఉంది. సోలో హీరోగా తనకు మార్కెట్ ఎప్పుడో తగ్గినప్పటికీ సరైన కంటెంట్ పడితే నటుడిగా సత్తా చాటుకోవాలని చూస్తున్న తరుణంలో దీని మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్నాక రిలీజ్ కొంత ఆలస్యమైనా సరే ఎట్టకేలకు ఎన్నో తర్వాత థియేటర్లకు తీసుకొస్తున్నారు. కంటెంట్ మీద బలమైన నమ్మకంతో రెండు రోజుల ముందే మీడియాతో పాటు కొందరు ప్రత్యేక ఆహ్వానితులకు హైదరాబాద్ ఆర్కె సినీప్లెక్స్ లో స్పెషల్ ప్రీమియర్ వేశారు. దాన్నుంచి వస్తున్న రిపోర్ట్స్, సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి.

వాటిలో ప్రధానమైంది రానా స్పెషల్ క్యామియో. అఘోరాగా ఊహించని గెటప్ లో కనిపించేది కాసేపే అయినా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో గుర్తుండిపోతాడట. స్టోరీకి సంబంధించిన ముఖ్యమైన ట్విస్టు తన మీదే ఆధారపడి ఉంటుందని సమాచారం. అదేంటో ఇక్కడ చెప్పేయడం భావ్యం కాదు కాబట్టి స్క్రీన్ మీద చూస్తేనే కిక్. నవదీప్, రానాలకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది. ఆ కారణంగానే అడగ్గానే లవ్ మౌళిలో స్పెషల్ రోల్ ఒప్పుకున్నాడు. కాకపోతే ఈ పాయింట్ ని ఎక్కడ లీక్ కాకుండా టీమ్ ప్రమోషన్ల టైంలో చాలా జాగ్రత్త పడింది. అదే వర్కౌట్ అయ్యేలా ఉంది.

మనమే, సత్యభామ, రక్షణతో పాటు మరో మూడు చిన్న సినిమాలతో పోటీ పడుతున్న లవ్ మౌళికి టాక్ చాలా కీలకం కానుంది. యూత్ ని ఆకట్టుకునేలా దర్శకుడు అవనీంద్ర చాలా అంశాలు పొందుపరిచాడు. ఏకంగా 42 ముద్దు సీన్లు ఉన్నాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ ధృవ నుంచి రవితేజ ఈగల్ దాక స్టార్ హీరోల సినిమాల్లో రెగ్యులర్ గా కనిపిస్తున్న నవదీప్ ఇందులో స్క్రీన్ మొత్తం తానై ప్రేమికుడి పాత్రలో కొత్తగా కనిపిస్తాడట. నిజంగా సినిమా ఎలా ఉందనేది రేపు తేలిపోతుంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. నవదీప్ ఎలాంటి ఫలితం అందుకుంటాడో.