గత ఏడాది బేబీ బ్లాక్ బస్టర్ తో ఆనంద్ దేవరకొండ మంచి పెర్ఫార్మర్ అని రుజువు కావడమే కాదు మార్కెట్ కూడా పెరిగింది. నెలల గ్యాప్ తర్వాత కొత్త సినిమా గంగం గణేశాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పలు వాయిదాలు వేసుకుంటూ ఎట్టకేలకు మోక్షం దక్కించుకుంది.
గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజే వాయు వేగంతో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు విస్తృతమైన ప్రమోషన్లు చేశారు. కామెడీ హీస్ట్ థ్రిల్లర్ కావడంతో నిఖిల్ స్వామి రారా తరహాలో దీని మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. గణేశా వాటిని ఏ మేరకు అందుకున్నాడో చూద్దాం.
అనాథైన గణేష్(ఆనంద్ దేవరకొండ) స్నేహితుడి (ఇమ్మానియేల్) తో దొంగతనాలు చేస్తూ పబ్బం గడుపుతూ ఉంటాడు. ప్రియురాలు శృతి (నయన్ సారిక) డబ్బు మోజులో పడి హ్యాండివ్వడంతో ఎలాగైనా కోటీశ్వరుడు కావాలని ఫిక్సవుతాడు.
కోట్ల రూపాయల విలువ చేసే ఒక వజ్రాన్ని నగల దుకాణం నుంచి కొట్టేసి పారిపోతూ ఉండగా పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం దాన్ని ఒక గణేశుడి విగ్రహంలో దాచి పెడతాడు. అదేమో నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి (రాజ్ అర్జున్)ది. శత్రువులు దాన్ని కొట్టేస్తారు. అక్కడి నుంచి అసలు డ్రామా మొదలవుతుంది. చివరి గణేష్ తన లక్ష్యం ఎలా అందుకున్నాడనేదే స్టోరీ.
ఇప్పుటి ఆడియన్స్ ని ఆషామాషీ జోకులతో నవ్వించలేం. అందులోనూ ఎంత సిల్లీగా ప్రయత్నిస్తే అంత తిరస్కారం ఎదురవుతుంది. దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తీసుకున్న పాయింట్ కొత్తగా లేకపోయినా వినోదానికి బోలెడు స్కోప్ ఉన్నదే. కానీ దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయాడు.
హీరో విలన్ గ్యాంగ్ చుట్టూ నడిపించిన హాస్యం, రొమాంటిక్ ట్రాక్, ఇమ్మానియేల్ జోకులు, వెన్నెల కిశోర్ క్యామియో ఇవేవి పని చేయలేదు. ఓ వర్గం మాస్ ని అక్కడక్కడా నవ్వించినా ఓవరాల్ గా మెప్పించడంలో మాత్రం ఫెయిలయ్యాడు. బేబీ తర్వాత డిఫరెంట్ గా ట్రై చేద్దామని చూసిన ఆనంద్ కు వ్రతం, ఫలితం రెండూ దక్కలేదు.