కరోనా టైంలో మినహాయిస్తే టాలీవుడ్ వేసవిలో ఎప్పుడూ చూడని స్లంప్ ఈసారి చూసింది. వేసవి సినిమాల సందడి పతాక స్థాయికి చేరుకునే మే నెలలో షోలు క్యాన్సిల్ చేయడం.. అసలు చెప్పుకోదగ్గ సినిమాల రిలీజ్‌లే లేకుండా శుక్రవారాలను ఖాళీగా వదిలేయడం ఈసారే చూశాం. ఎన్నికలు, ఐపీఎల్ పుణ్యమా అని ఒక్కో వారం గడిచేకొద్దీ బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు దయనీయంగా మారాయి.
ఐతే రెండు వారాల ముందే ఎన్నికలు పూర్తవగా.. గత వారంతో ఐపీఎల్ కూడా అయిపోయింది. లాస్ట్ వీకెండ్లో వచ్చిన ‘లవ్ మి’తోనే బాక్సాఫీస్ కొంచెం పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది. సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌లో అనుకున్నంత కళ కనిపించలేదు. ఐతే ఇప్పుడు బాక్సాఫీస్‌ను రివైవ్ చేసే బాధ్యత ముగ్గురు యువ కథానాయకుల మీద పడింది. ఆ ముగ్గురే.. విశ్వక్సేన్, కార్తికేయ, ఆనంద్ దేవరకొండ.
ఈ ముగ్గురు యంగ్ హీరోల కొత్త చిత్రాలు ఒకే రోజు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటిలో విశ్వక్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీని టీజర్, ట్రైలర్ చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ దూకుడు చూపిస్తోంది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. సమ్మర్లో ‘టిల్లు స్క్వేర్’ తర్వాత వెలవెలబోయిన థియేటర్లను ఈ చిత్రం కళకళలాడిస్తుందనే అంచనాలున్నాయి.
ఇక కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’, ఆనంద్ దేవరకొండ మూవీ ‘గం గం గణేశా’ యూత్‌కు నచ్చే ఫన్, థ్రిల్లర్ మూవీస్‌లా కనిపిస్తున్నాయి. వీటి ట్రైలర్లు కూడా ఆకట్టుకున్నాయి. సరైన సినిమాలు లేక గత కొన్ని వారాల్లో థియేటర్లకు రావడం మానేసిన సినీ ప్రియులకు ఈ వారం మంచి మంచి ఆప్షన్లే ఉన్నాయి. కావాల్సిందల్లా ఈ మూడు చిత్రాలకు మంచి టాక్ రావడమే. అది వస్తే మూడు చిత్రాలూ వేటికవే బాగా ఆడి టాలీవుడ్‌లో తిరిగి ఉత్సాహం తీసుకురావడం ఖాయం.