వరుణ్‍ తేజ్‍ని ఫాలో అవుతోన్న మెగా హీరో

మెగా హీరోలలో వరుణ్‍ తేజ్‍ ఒక్కడిదీ విభిన్నమైన పంథా. మెగా హీరోలంటే మాస్‍ డైలాగులు, బ్రేక్‍ డాన్సులు అనేది ఫాన్స్ నిశ్చితాభిప్రాయం. కానీ వరుణ్‍ తేజ్‍ అవేమీ చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‍ తెచ్చుకున్నాడు. ఒకే మూసలో పడిపోకుండా అన్ని రకాల పాత్రలు, సినిమాలు చేస్తున్నాడు. మెగా హీరోలందరిలోను తను ప్రత్యేకమని అనిపించుకున్నాడు.

ఇప్పుడు మరో మెగా హీరో కూడా అదే దారిలో వెళుతున్నాడు. చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్‍ తేజ్‍ తమ్ముడు వైష్ణవ్‍ తేజ్‍ హీరోగా ఇమేజ్‍ తెచ్చే పాత్రల కోసం చూడడం లేదు. సగటు కుర్రాడిని తలపించే పాత్రలే ఏరి కోరి ఎంచుకుంటున్నాడు. మొదటి సినిమా ఉప్పెన విడుదల కాకుండానే క్రిష్‍తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కమర్షియల్‍ సినిమాలా కాకుండా ఆర్ట్ ఫిలిం తరహాలో వుంటుందని అంటున్నారు. వరుణ్‍ కూడా రెండవ సినిమా కంచె క్రిష్‍ డైరెక్షన్‍లోనే చేసాడు.

ఆ సినిమాతోనే అతనికి హీరోగా ఐడెంటిటీ వచ్చింది. అక్కడ్నుంచీ అన్నీ విభిన్నమైన సినిమాలే ఎంచుకుంటూ వెళ్లాడు. మాస్‍ సినిమాలు చేసి, చేసి ఒకానొక దశలో కెరీర్‍ ప్రమాదంలో పడిన తన అన్నయ్య సాయి ధరమ్‍ తేజ్‍ అనుభవంతో ఈ ట్రెండ్‍లో మాస్‍ సినిమాలు కరక్ట్ కాదని ఈ యువ హీరో ముందే పసిగట్టేసాడు. ఓటిటి జమానాలో ప్రయోగాలకు ఫుల్‍ డిమాండ్‍ ఇప్పుడు.