వైష్ణవి తప్పిన పరీక్ష ఆనంద్ గెలవాలి

మాములుగా ఒక బ్లాక్ బస్టర్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందంటే దాంట్లో నటించిన హీరో హీరోయిన్, దర్శకుడికి ఆ తర్వాత చేసే సినిమాలపై వద్దన్నా అంచనాలు పెరిగిపోతాయి. శివ తర్వాత నాగార్జున, అల్లూరి సీతారామరాజు తర్వాత కృష్ణ ఈ ఫేజ్ నుంచి బయటికి వచ్చేందుకు చాలా సమయం తీసుకున్నారు. వాటితో పోల్చేంత పెద్ద రేంజ్ కాదు కానీ రిలీజైన టైంలో ఉన్న అంచనాలకు, తర్వాత వచ్చిన కలెక్షన్లకు పొంతన లేని స్థాయిలో బేబీ సంచలనం రేపిన మాట వాస్తవం. కాసిన్ని లాభాలు వస్తే చాలనుకునే రేంజ్ నుంచి వంద కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్లడం అంటే మాటలు కాదు.

ఇక విషయానికి వస్తే బేబీ పుణ్యమాని వెలుగులోకి వచ్చిన వైష్ణవి చైతన్యకు ఇటీవలే విడుదలైన లవ్ మీ ఇఫ్ యు డేర్ చేదు ఫలితాన్ని మిగిల్చింది. దిల్ రాజు బ్యానర్, అందులోనూ వాళ్ల ఫ్యామిలీ ఆశిష్ హీరో, కీరవాణి పిసి శ్రీరామ్ లాంటి టాప్ టెక్నీషియన్స్, అన్నింటిని మించి దెయ్యాన్ని ప్రేమించే వెరైటీ కాన్సెప్ట్ ఇంకేం ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. తీరా చూస్తే ఎవరిని మెప్పించలేక లవ్ మీ పరాజయం మూటగట్టుకుంది. వసూళ్ల గురించి పోస్టర్లలో పెద్ద నెంబర్లు వేస్తున్నారు కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉందని బుకింగులు, కలెక్షన్కు స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పుడు బేబీ హీరో ఆనంద్ దేవరకొండ ఎల్లుండి గంగం గణేశాతో వస్తున్నాడు. ప్రమోషన్లు బాగున్నాయి. పబ్లిసిటీ ద్వారా ఇది వస్తున్న విషయాన్ని జనాల దగ్గరకు తీసుకెళ్లారు. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజే వాయు వేగం పోటీ ఉన్నా సరే టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా కంటెంట్ గురించి ప్రమోట్ చేసుకుంటోంది. వైష్ణవి చైతన్య లవ్ మీ ద్వారా బాక్సాఫీస్ పరీక్షలో ఫెయిలైనప్పటికీ ఆనంద్ దేవరకొండ పాస్ కావడం చాలా అవసరం. ఎందుకంటే బేబీ సక్సెస్ కి చాలా అంశాలు దోహదం చేశాయి సంగీతంతో సహా. గంగం గణేశా భారం ఎక్కువగా ఆనంద్ ఇమేజ్ మీదే ఆధారపడి ఉంటుంది. సో రిజల్ట్ ఎలా ఉంటుందో.