తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతాన్ని కంపోజ్ చేసే అవకాశాన్ని కీరవాణికి ఇవ్వడం పట్ల ఆయన మద్దతుదారులు ఒకవైపు, ఇది సరికాదని వ్యతిరేకిస్తున్న వర్గం ఇంకోపక్క డిబేట్లు చేస్తూనే ఉన్నాయి.
మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన తన సంగీత ప్రస్థానాన్ని హైదరాబాద్ లోనే కొనసాగిస్తున్న ఈ ఆస్కార్ విజేత ఏనాడూ తన మూలాలున్న ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లాలనే ఆలోచన, ఆ దిశగా చర్యలు కానీ చేయలేదు. అందుకే ఇలాంటి కళాకారులకు ప్రాంతీయత ఆపాదించరాదనేది సపోర్టర్స్ అంటున్న మాట. తెలంగాణ సినీ సంగీత సంఘం మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది.
నిజానికి కీరవాణికి నైజామ్ పాటలతో అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. ఈ ప్రాంతపు తీవ్రవాదం మీద తీసిన పీపుల్స్ ఎన్ కౌంటర్ కి అద్భుతమైన పాటలు 1991లోనే ఇచ్చారు. మొండిమొగుడు పెంకి పెళ్ళాంలో లాలూ దర్వాజ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చెక్కుచెదరని ఆణిముత్యం.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇవన్నీ కాదు ఆస్కార్ ఇచ్చింది రాష్ట్రాన్ని బట్టి కాదు కదా అనే వెర్షన్ ని కొట్టిపారేయలేం. ఎందరో గొప్ప సంగీత దర్శకులు ఉన్న తెలంగాణలో ఎవరూ దొరకనట్టు కీరవాణిని ఎంచుకోవడం పట్ల అభ్యంతరం అంత సులభంగా తీసిపారేసేది కాదు.
దీనికి పరిష్కారం దొరుకుతుందా లేదానేది పక్కనపెడితే కీరవాణి గురించి ఇంత చర్చ జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ లెక్కన కర్ణాటకకు చెందిన రజనీకాంత్ తమిళనాడులో సూపర్ స్టార్ కావడం, కేరళకు చెందిన సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ లాంటి వాళ్ళు టాలీవుడ్ లో జెండాలు పాతడం, ఉత్తరాదికి చెందిన హీరోయిన్లకు ఇక్కడ అగ్ర స్థానం ఇవ్వడం ఇవన్నీ ప్రస్తావించాల్సిన విషయాలే.
కీరవాణి ఇష్యూకి పరిశ్రమ నుంచే కాక రాజకీయంగానూ రంగు పులుముకోవడం ఎక్కడికి దారి తీస్తుందో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తీసుకోరని టాక్.