కన్నప్ప లెవెలే మారిపోతోందిగా..

మంచు విష్ణు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. కన్నప్ప. ఈ చిత్రాన్ని విష్ణు అనే కాదు.. మంచు ఫ్యామిలీనే ఎంతో ప్రెస్టీజియస్‌గా తీసుకుంది. విష్ణు హిట్టు కొట్టి చాలా కాలం అయినా, తన మార్కెట్ బాగా దెబ్బ తినేసినా.. ఈ సినిమా మీద వంద కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, నయనతార.. ఇలా భారీ కాస్టింగే సెట్ చేశారు ఈ చిత్రానికి.

మొదలైనపుడు జనం పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఈ కాస్టింగ్, షూటింగ్ గురించి అప్‌డేట్స్ చూశాక క్యూరియాసిటీ పెరిగింది. ఏపీ, తెలంగాణల్లో ఎన్నికల సమరం జరుగుతున్న వేళ.. ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రిస్టింగ్‌ అప్‌డేట్‌తో మంచు విష్ణు ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా టీజర్ త్వరలోనే లాంచ్ కాబోతున్నట్లు వెల్లడించాడు.

‘కన్నప్ప’ టీజర్ లాంచ్‌కు పెద్ద వేదికనే ఎంచుకున్నాడు విష్ణు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ నెల 20న ‘కన్నప్ప’ టీజర్ లాంచ్ చేయబోతున్నారట. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు ఉన్న ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాల ప్రమోషన్లు జరుగుతుంటాయి. అలాంటి చోట ‘కన్నప్ప’ టీజర్ లాంచ్ చేసి జనాలను మెప్పిస్తే ఈ సినిమాకు మంచి హైప్ వస్తుందనడంలో సందేహం లేదు.

టీజర్ గురించి అప్‌డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన ‘కన్నప్ప’ కొత్త పోస్టర్ కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. మనిషి ఎముకలతో తయారు చేసిన కత్తి భలేగా అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. దేశ విదేశాల్లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ ఏడాది చివర్లో ‘కన్నప్ప’ ప్రేక్షకులను పలకరించబోతోంది.