నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్ తో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని పన్నెండు రోజుల పాటు చిత్రీకరించబోతున్నట్టు వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎపిక్ పీరియాడిక్ డ్రామాలో సంయుక్త మీనన్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కెజిఎఫ్ సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కార్తికేయ 2 కంటే ఎన్నో రెట్లు పెద్ద ఖర్చుతో వస్తున్న స్వయంభు కోసం నిఖిల్ కష్టపడి యుద్ధ విద్యలు, కత్తిసాము నేర్చుకున్నాడు.
ఇక సవాళ్ల విషయానికి వస్తే రాబోయే తొమ్మిది నెలల్లో స్వయంభు తరహా ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఇంకో మూడు ప్యాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి. మొదటిది కల్కి 2898 ఏడి. వచ్చే నెల ఇరవై ఏడున విడుదల కానుంది. నాగ అశ్విన్ టేకింగ్ గురించి ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. రెండోది చిరంజీవి విశ్వంభర. 2025 జనవరి 10 విడుదల లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వశిష్ట పక్కా ప్లానింగ్ ఆలస్యం లేకుండా చూసుకుంటున్నాడు. ఇక మూడోది సూర్య కంగువా. దాదాపు చివరి దశలో ఉంది.
వీటికి స్వయంభుకున్న సంబంధం జానర్ పరంగా తప్ప కథ గురించి కాదు. వీటిలో కల్కి మాత్రమే స్వయంభు కంటే ముందు వస్తోంది. సో నిఖిల్ బృందం సాధ్యమైనంత మేరకు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో రిలీజ్ చేసే అవకాశం ఉందేమో చూసుకోవాలి. కంగువ ఈ ఏడాదే అన్నారు కానీ ఎంతమేరకు సాధ్యమో చెప్పలేని పరిస్థితి నెలకొంది. స్వయంభు కనక ముందే వచ్చేసి బ్లాక్ బస్టర్ కొడితే పోలికల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా పురాణాలు, ఇతిసహసాలు బ్యాక్ డ్రాప్ లో నిఖిల్ మూవీ చాలా హోమ్ వర్క్ చేసింది. ఇది కనక బ్రేక్ ఇస్తే నిఖిల్ మార్కెట్ మరింత విస్తరిస్తుంది. తన లక్ష్యం అదే.