‘యానిమల్ సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లింది’

ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తంలో సందీప్ రెడ్డి వంగ మూవీ ‘యానిమల్’ స్థాయిలో మరేదీ వివాదాస్పదం కాలేదు. ఒక సినిమాలోని అంశాల మీద ఏదైనా ఒక వర్గం మనోభావాలు దెబ్బ తినడం.. విమర్శలు గుప్పించడం మామూలే. కానీ బయటి వాళ్లు కాకుండా సినిమా ఇండస్ట్రీలోని వాళ్లే ఒక చిత్రాన్ని తూర్పారబట్టడం.. తీవ్ర స్థాయిలో బహిరంగంగా విమర్శలు చేయడం అరుదు. ‘యానిమల్’ విషయంలో అదే జరిగింది.

బాలీవుడ్ లెజెండరీ రైటర్లలో ఒకరైన జావెద్ అక్తర్ సహా చాలామంది ఈ చిత్రంలోని అంశాలను తప్పుబట్టారు. ఇందులో సన్నివేశాలను తీవ్రంగా తప్పుబట్టారు. పురుషాధిక్యత, మహిళలపై దురహంకారాన్ని గ్లోరిఫై చేసేలా సినిమా ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఇటీవలే హీరో సిద్దార్థ్ సైతం ‘చిత్తా’ లాంటి మంచి సినిమా విషయంలో అభ్యంతరాలు చెప్పిన వాళ్లు ‘యానిమల్’ను మాత్రం ఎగబడి చూశారంటూ పరోక్షంగా కౌంటర్లు వేశారు. కాగా ఇప్పుడు ఓ బాలీవుడ్ నటుడు, సివిల్ సర్వెంట్ ‘యానిమల్’ మీద తీవ్ర విమర్శలు గుప్పించాడు. అతనే.. వికాస్ దివ్య కీర్తి. ఈ మధ్య బ్లాక్ బస్టర్ అయిన ‘12th fail’ సినిమాలో ఈ నటుడు ఓ కీలక పాత్ర పోషించాడు.

వికాస్ ఐఏఎస్ అధికారి, విద్యా ఉద్యమకారుడు కూడా. ఆయన ‘యానిమల్’ సినిమాలో చూపించిన అంశాల మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. ఈ సినిమా సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించాడు. ఇలాంటి సినిమాలు తీయడం తప్పు అన్నాడు. సినిమాలో ఒక చోట రణబీర్.. త్రిప్తి దిమిరిని షూ నాకమని అడుగుతాడని.. అలాంటివి చూసి నిజ జీవితంలో కూడా చాలామంది మగాళ్లు ఆడవాళ్లను అలా ఆదేశిస్తారని వికాస్ అన్నాడు. ఏ సినిమాలో అయినా కొంత సామాజిక బాధ్యత ఉండాలని.. కేవలం డబ్బుల కోసమే తీస్తే ఇలాంటి సినిమాలే వస్తాయని ఆయన వ్యాఖ్యానించాడు.