జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ దేవర థియేట్రికల్ హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన బడా సంస్థలు నువ్వా నేనాని తలపడుతున్న తరుణంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ తరఫున నిర్మాత నాగవంశీకి డీల్ దాదాపు ఓకే అయ్యిందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. 115 నుంచి 125 కోట్ల మధ్యలో ఏపీ తెలంగాణ కలిపి ఒక నెంబర్ దగ్గర లాక్ చేస్తారని, అగ్రిమెంట్ అవ్వగానే అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వస్తుందని సమాచారం. అప్పటిదాకా దీన్ని నిర్ధారణగా చెప్పలేం.
ఇక్కడ కొన్ని అంశాలు గమనిస్తే పైన చెప్పిన విషయానికి బలం చేకూరుతుంది. ఇటీవలే జరిగిన టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు తారక్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ముందు రోజు రాత్రి స్పెషల్ ప్రీమియర్ చూశాడు. మాములుగా అన్నయ్య కళ్యాణ్ రామ్ కు తప్ప బయట ఈవెంట్లకు అంత సుముఖత చూపని జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా టిల్లుకు మాత్రమే ఎందుకు సానుకూలంగా ఉన్నాడంటే అప్పటికే దేవర డీల్ కు సంబంధించి తన ప్రయత్నాలను నాగవంశీ బయటపెట్టడం వల్లేనని టాక్. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అదే వేదిక మీద 2024 దేవర నామ సంవత్సరమని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు.
ఇవన్నీ ఒకదానికి మరొకటి ముడిపెట్టుకుని చూస్తే దేవర సితార చేతికి రావడంలో ఆశ్చర్యం లేదు. ఇంకా అయిదు నెలల సమయం ఉన్నప్పటికీ నిర్మాతలు బిజినెస్ డీల్స్ అన్నీ క్లోజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. చివరి నిమిషం దాకా హడావిడి పడకుండా ముందే పూర్తి చేసుకుంటే పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ తదితర కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎస్విసి, మైత్రి లాగా పంపిణి రంగంలో పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉన్న సితార సంస్థకు నిజంగా దేవర చిక్కితే పెద్ద ప్రమోషన్ వచ్చినట్టే. ఆపై మెల్లగా ఇతర ప్యాన్ ఇండియా సినిమాలను టార్గెట్ చేసుకుని వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.