‘మా’ ఎన్నికలు.. అప్పుడలా.. ఇప్పుడిలా


గత రెండు మూడు పర్యాయాలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో ఎంత హడావుడి నడిచిందో తెలిసిందే. కొన్నేళ్ల కిందట ‘మా’ అధ్యక్షులుగా జయసుధ, రాజేంద్ర ప్రసాద్ పోటీకి దిగినపుడు.. అవి సాధారణ ఎన్నికలను గుర్తు చేశాయి. ప్రచార హోరు.. పరస్పర విమర్శలు, ఆరోపణలు చూసి అందరూ షాకయ్యారు. నరేష్ అధ్యక్షుడిగా ఎన్నికైనపుడు కూడా కొంత హడావుడి నడిచింది. ఇక గత పర్యాయం అయితే మా ఎన్నికలు ఒక రణరంగాన్నే తలపించాయి.

మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్ల మధ్య పోరు సాధారణ ఎన్నికలను మించిపోయింది. వాదోపవాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో ‘మా’ ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరుకుంది. చివరికి ఈ ఎన్నికల్లో మంచు విష్ణు గెలవగా.. ఫలితాల అనంతరం కూడా వివాదాలు కొనసాగాయి. ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్ సభ్యులు ‘మా’కు దూరం కావడం చర్చనీయాంశం అయింది.

కట్ చేస్తే ‘మా’ గత కార్యవర్గం పదవీ కాలం పూర్తయింది. ఇప్పుడు మళ్లీ ‘మా’ ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం వచ్చింది. కానీ ఎన్నికల పట్ల ఎవరికీ ఆసక్తి లేదు. విష్ణు ప్యానెల్ మీద పోటీకి అవతల వర్గం సిద్ధంగా లేదు. గత ఎన్నికలతోనే ‘మా’కు పూర్తిగా దూరం అయిన ప్రకాష్ రాజ్, ఆయన వర్గం ఇప్పుడు పోటీకి ఎంతమాత్రం సుముఖంగా లేదు. అలా అని వేరే వాళ్లు కూడా ఎవరూ విష్ణు మీద పోటీ చేయడానికి ఆసక్తి చూపించట్లేదు. మొత్తంగా అందరికీ ‘మా’ ఎన్నికల మీద ఆసక్తి పోయినట్లుంది.

తాజాగా ‘మా’ సభ్యులు సమావేశం నిర్వహించి ఎన్నికలు అవసరం లేదని.. ప్రస్తుత ప్యానెల్‌నే కొనసాగించాలని నిర్ణయించారు. ‘మా’కు భవనం కట్టే వరకు మంచు విష్ణునే అధ్యక్షుడిగా ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ వ్యవహారం పెద్దగా హడావుడి లేకుండా ముగిసిపోయింది. గత పర్యాయం ‘మా’ ఎన్నికల విషయంలో జరిగిన గొడవను చూసి.. ఇప్పుడింత స్తబ్దుగా ఎన్నికలే లేకుండా మళ్లీ విష్ణునే అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల అవాక్కవుతున్నారు జనాలు.