సంగీత ద‌ర్శ‌కుడికి నిర్మాత చుర‌క‌లు

త‌మిళ ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల‌కు తెలుగు మార్కెట్ నుంచి వ‌చ్చే క‌లెక్ష‌న్లు కావాలి కానీ.. ఇక్క‌డికి వ‌చ్చి త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకునే తీరిక మాత్రం ఉండ‌ద‌ని త‌ర‌చుగా విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి. సూర్య‌, కార్తి లాంటి వాళ్లు కొంద‌రు మాత్ర‌మే ఈ విష‌యంలో శ్ర‌ద్ధ చూపిస్తుంటారు. మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల‌లో చాలామంది త‌మ సినిమాల తెలుగు వెర్ష‌న్ల ప్రమోష‌న్ల‌ను అంత‌గా ప‌ట్టించుకోరు.

ఈ నేప‌థ్యంలో త‌మిళ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవీ ప్ర‌కాష్ కుమార్‌కు టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ అద‌ను చూసి మంచి పంచ్ వేశాడు. జీవీ ప్ర‌కాష్ న‌టుడిగా కూడా ఫుల్ బిజీ అన్న సంగ‌తి తెలిసిందే. అత‌డి సినిమాలు కొన్ని తెలుగులోనూ రిలీజ‌య్యాయి.

ఇప్పుడు డియ‌ర్ పేరుతో జీవీ చేసిన ఓ సినిమా తెలుగులోనూ ఈ నెల 12న విడుద‌ల కాబోతోంది. ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు అతిథుల్లో ఒక‌రుగా వ‌చ్చిన నాగ‌వంశీ.. జీవీ త‌మ సంస్థ‌లో రెండు సినిమాల‌కు ప‌ని చేశాడ‌ని.. కానీ ఆ సినిమాల ప్ర‌మోష‌న్ల‌కు హాజ‌రు కాలేద‌ని.. కానీ తాము మాత్రం అత‌డి సినిమా తెలుగు వెర్ష‌న్ ప్ర‌మోష‌న్ల‌కు హాజ‌ర‌య్యామ‌ని చుర‌క అంటించాడు.

దీంతో జీవీ న‌వ్వేస్తూ.. తాను సితార సంస్థ‌లో ప్ర‌స్తుతం సంగీతం అందిస్తున్న ల‌క్కీ భాస్క‌ర్‌కు సంబంధించి ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌కూ త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతాన‌ని అన్నాడు. ఈ వేడుక‌లో ల‌క్కీ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి సైతం పాల్గొన్నాడు. అత‌ను తీసిన స‌ర్‌తో పాటు ఆదికేశ‌వ చిత్రాల‌కు సితార సంస్థ‌లో ప‌ని చేశాడు జీవీ.