మనోళ్లు పట్టించుకోలా.. అక్కడ వంద కోట్లు

తెలుగు ప్రేక్షకులకు భాషా భేదం అనేదే ఉండదు. మంచి సినిమా ఎక్కడి నుంచి వచ్చినా ఆదరిస్తారు. డబ్బింగ్ సినిమాలను మన వాళ్లు నెత్తిన పెట్టుకున్నట్లు ఎవ్వరూ పెట్టుకోరు. ఈ మధ్య మనవాళ్లు మలయాళ చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. గత నెలలో ‘ప్రేమలు’ అనే మలయాళ సినిమాను సూపర్ హిట్ చేశారు.

మమ్ముట్టి సినిమా ‘భ్రమయుగం’ కూడా ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనే సినిమా మంచి టాక్‌తో మొదలై బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటేలా కనిపిస్తోంది. ఐతే వీటి మధ్యలో ‘ది గోట్ లైఫ్: ఆడుజీవితం’ అనే మరో మలయాళ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ట్రైలర్ చూస్తేనే ఇది గొప్ప సినిమా అనే సంకేతాలు కనిపించాయి. టాక్ కూడా అలాగే వచ్చింది. కానీ ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్‌లో పెద్దగా ప్రభావమే చూపలేదు.

‘ది గోట్ లైఫ్’ గొప్ప సినిమా అనడంలో సందేహం లేదు. హాలీవుడ్ స్టాండర్డ్స్ కనిపించాయి సినిమాలో. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పెట్టేశాడు. ఒక పాత్ర కోసం ఏ స్టార్ హీరో చేయని సాహసం చేశాడు. కానీ ఈ సినిమా మరీ నెమ్మదిగా సాగడం.. విపరీతమైన వేదనకు గురి చేసేలా ఉండడం.. నిడివి మరీ ఎక్కువ అయిపోవడంతో తెలుగు ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. మంచి సినిమా అంటూనే చూడలేం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సినిమాకు రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి. కానీ మలయాళ ప్రేక్షకులు మాత్రం ‘ది గోట్ లైఫ్’ను నెత్తిన పెట్టుకున్నారు. పృథ్వీరాజ్ కష్టానికి గొప్ప ఫలితాన్ని అందించారు. రిలీజైన దగ్గర్నుంచి హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది ఈ చిత్రం. మలయాళ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా వంద కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ది గోట్ లైఫ్’ నిలవడం విశేషం. ఆర్ట్ సినిమాలా అనిపించే ఇలాంటి మూవీకి ఇంత మంచి కలెక్షన్ ఇచ్చి తమ అభిరుచిని చాటుకున్నారు మలయాళ ఆడియన్స్.