లిల్లీ….అనుపమకు కొత్త ఆక్సిజన్

టిల్లు స్క్వేర్ విడుదల ముందు వరకు ఇంత బోల్డ్ పాత్ర ఎందుకు చేసిందనే ప్రశ్నలతో అనుపమ పరమేశ్వరన్ ఒక రకంగా విసుగెత్తిపోయింది. యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ పెట్టి మరీ ట్రోలింగ్ చేసే దాకా ఇవి శృతి మించడంతో మనస్థాపం చెంది ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేదు. హిట్ అయితే సక్సెస్ మీట్ కు తీసుకొస్తానని సిద్దు జొన్నలగడ్డ చెప్పి ఆ మాటని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు లిల్లీ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా ప్రారంభంలో రొమాన్స్ డోస్ ఎక్కువే ఉన్నప్పటికీ క్రమంగా ఆ క్యారెక్టర్ కు పెట్టిన ట్విస్టులు, షేడ్స్ ప్రేక్షకులను షాక్ కు గురి చేశాయి.

బోల్డ్ గా నటించినా, లిప్ లాక్ కిస్సులు పెట్టినా అవేవి ఎబ్బెట్టుగా లేకుండా చూసుకోవడంలో దర్శకుడు మల్లిక్ రామ్, హీరో సిద్దు జొన్నలగడ్డలు సక్సెసయ్యారు. కథ ముందుకెళ్లే కొద్దీ గ్లామర్ ఫ్యాక్టర్ ని తగ్గించేసి పూర్తిగా స్టోరీ మీద ఫోకస్ పెట్టడంతో అన్ని అంశాలు బ్యాలన్స్ అయ్యాయి. ఇప్పుడీ లిల్లీ అనుమప పరమేశ్వరన్ కెరీర్ కి ఆక్సిజన్ గా మారుతోంది. గత కొంత కాలంగా తెలుగులో తనకు సరైన సక్సెస్ లేదు. రవితేజ ఈగల్ వర్కౌట్ కాలేదు. ఓటిటి మూవీ బట్టర్ ఫ్లై, నిఖిల్ తో చేసిన 18 పేజెస్ యావరేజయ్యాయి. ఒక్క కార్తికేయ 2 మాత్రమే బ్లాక్ బస్టర్ అందుకుంది.

దాని క్రెడిట్ ఎక్కువ హీరో దర్శకుడికే వెళ్లిపోవడంతో అనుపమకు బ్రేక్ అనిపించలేదు. ఆ మాటకొస్తే శతమానం భవతి తర్వాత సోలోగా దక్కిన గొప్ప హిట్టు లేదు. రాక్షసుడు విజయవంతమైనా, హలో గురు ప్రేమ కోసమే పర్వాలేదనిపించినా అవకాశాలు ఊపందుకోలేదు. కానీ టిల్లు స్క్వేర్ తర్వాత లెక్క మారిపోయింది. క్రమంగా దర్శక నిర్మాతల నుంచి కాల్స్ వస్తున్నాయని తెలిసింది. పలు కోణాల్లో పెర్ఫార్మన్స్ ఎలా రాబట్టుకోవచ్చో ఈ సినిమా నిరూపించడంతో మళ్ళీ బిజీ అవ్వబోతోంది. ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ లో ప్రధాన పాత్ర చేసిందనే టాక్ ఉంది కానీ ఇంకా అధికారిక ప్రకటన రావాలి.