స్టార్ హీరో కూతురికి నటించే కష్టాలు

పెద్ద స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అభిమానుల అంచనాల కన్నా తండ్రుల పేరుని నిలబెట్టాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు. సోషల్ మీడియా జమానాలో ట్రోలింగ్ కి బలికాక తప్పదు. ప్రస్తుతం దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ గారాల పట్టి సారా అలీ ఖాన్ ఇదే పరిస్థితిని ఎదురుకుంటోంది. ఇటీవలే ఆమె నటించిన ఏ వతన్ మేరె వతన్ అమెజాన్ ప్రైమ్ లో నేరుగా రిలీజయ్యింది. స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్ల పాలనని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని భారీ బడ్జెట్ తో తీశారు. కణ్ణన్ అయ్యర్ దర్శకుడు.

కంటెంట్ ఎలా ఉందనేది పక్కనపెడితే సారా నటన మీద తీవ్ర విమర్శలు వచ్చి పడ్డాయి. ఇంత బరువైన పాత్రకు కావాల్సిన ఎక్స్ ప్రెషన్లను ఇవ్వలేకపోయిందని, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నటనను మెరుగు పరుచుకోకపోతే ఎలా అంటూ తలంటింది. తెల్లదొరలు వ్యతిరేకంగా ప్రైవేట్ రేడియో స్థాపించే యువతిగా ప్రధాన పాత్ర దక్కినా ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. పవన్ కళ్యాణ్ ఓజిలో విలన్ గా చేస్తున్న ఇమ్రాన్ హష్మీ లాంటి సీనియర్ క్యాస్టింగ్ ఇందులో పెద్దదే ఉంది. దీనికన్నా ముందు సారా మరో మూవీ మర్డర్ ముబారక్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది.

దీనికి సైతం నెగటివ్ ఫీడ్ బ్యాక్ తప్పలేదు. విజయ్ వర్మతో బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోవడం తప్ప యాక్టింగ్ పరంగా గుర్తుండిపోయేలా ఏమీ చేయలేదని కామెంట్స్ వచ్చి పడ్డాయి. అవకాశాలు లోటు లేకపోయినా సారా మీద ఇలా క్రిటిసిజం రావడం విచారకరం. ఒకపక్క పోటీగా ఉన్న జాన్వీ కపూర్ లాంటి వాళ్ళు సౌత్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల సరసన ఆఫర్లు పట్టేస్తూ ఉంటే సారా మాత్రం ఇలా వెనుకబడిపోవడం సైఫ్ గమినించకుండా ఉండడు. అయినా సరైన కథలు దర్శకులు కుదరకపోతే ఆయన మాత్రం ఏం చేయగలడు. గతంలో బాగానే చేసిన సారా ఇప్పుడిలా రివర్స్ కావడం ఏమిటో.