నెట్ ఫ్లిక్స్ పోటీ తట్టుకోవడానికి ప్రైమ్ బ్రహ్మాస్త్రాలు

థియేటర్ వ్యవస్థకు సమాంతరంగా ఎదగాలని పోటీ పడుతున్న ఓటిటిలోనూ విపరీతమైన కాంపిటీషన్ నెలకొంది. మార్కెట్ పెంచుకుని ఆధిపత్యం చూపించేందుకు వందల కోట్ల పెట్టుబడులతో సిద్ధమవుతోంది. నిన్నటి సంవత్సరం నుంచి నెట్ ఫ్లిక్స్ ప్రత్యేకంగా సౌత్ మార్కెట్ మీద దృష్టి పెట్టి నిర్మాతలు ఊహినంత మొత్తాలు ఆఫర్ చేసి క్రేజీ సినిమాలన్నీ కొనేసుకుంటుంటోంది. అందుకే గతంలో ప్రైమ్ తో ఒప్పందాలు చేసుకున్న అగ్ర సంస్థల కొత్త ప్యాన్ ఇండియా మూవీస్ ని భారీ రేట్లు ఇచ్చి సొంతం చేసుకున్న వైనం చూస్తున్నాం. ఈ ఏడాదిలోనే పదికి పైగా రాబోతున్నాయి.

కరోనా టైంలో తిరుగులేని స్పీడ్ తో పరుగులు పెట్టిన అమెజాన్ ప్రైమ్ కు హఠాత్తుగా నెట్ ఫ్లిక్స్ చూపిస్తున్న వేగం అడ్డంకిగా మారింది. కొంత వెనుకబడాల్సి వచ్చింది. దీనికి విరుగుడుగా ముల్లుని ముల్లుతోనే తీయాలనే సూత్రంతో తిరిగి రేస్ లో నిలబడేందుకు బ్రహ్మాస్త్రాలను సిద్ధం చేసుకొంటోంది. అందులో భాగంగానే ఇవాళ జరగబోయే గ్రాండ్ ఈవెంట్ లో సుమారు యాభైకి పైగా టైటిల్స్ ని ప్రకటించబోతున్నట్టు తెలిసింది. వాటిలో నాగ చైతన్య దూత 2తో పాటు ఇతర బ్లాక్ బస్టర్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్, పంచాయత్, మీర్జాపూర్, పాతాళ్ లోక్ కొనసాగింపులు ఉంటాయి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, సూర్య కంగువ టీజర్లను రిలీజ్ చేయడం ద్వారా వాటి హక్కులను సొంతం చేసుకున్న విషయాన్ని ఇదే వేదికపై ప్రకటించబోతున్నట్టు తెలిసింది. వీటితో పాటు మరికొన్ని సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్స్ ఉండబోతున్నాయి. చూస్తుంటే తిరిగి ఓటిటి రంగంలో కొత్త విప్లవం వచ్చేలా ఉంది. కాకపోతే చిన్న నిర్మాతలు ఇకపై నష్టాలు తెచ్చే సినిమాల మీద పెట్టుబడి పెట్టడం కంటే క్వాలిటీ కంటెంట్ తో వెబ్ సిరీస్ లాంటివి చేస్తే మార్కెట్ పరంగా వర్కౌట్ అయ్యేలా ఉంది. ప్రైమ్ ఈవెంట్ కు క్రేజీ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున రాబోతున్నారు.