గామిని వాళ్లు చూస్తున్నారా?

ఫిబ్రవరి అంతా డల్లుగా సాగిన టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఇప్పుడు కొంత ఊపు వచ్చిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వారం రిలీజైన మూడు చిత్రాలకూ వీకెండ్ వసూళ్లు బాగానే ఉన్నాయి. మలయాళ అనువాద చిత్రం ‘ప్రేమలు’ దాని స్థాయికి అది అంచనాలను మించి వసూళ్లు రాబడుతోంది. ఇక గోపీచంద్ మూవీ ‘భీమా’ మాస్ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. దీనికి టాక్ ఏమంత బాగా లేకపోయినా.. మాస్ చూస్తుండటంతో వీకెండ్లో థియేటర్లు కళకళలాడుతున్నాయి.

ఇక ఈ వారం చిత్రాల్లో టాప్ ప్లేస్ ‘గామి’నే దక్కించుకుంది. క్రేజీ టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రానికి టాక్ కూడా బాగుంది. ఆహా ఓహో అనకపోయినా డీసెంట్‌గా ఉంది, డిఫరెంట్ మూవీ అనే టాక్ రావడంతో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగానే చూస్తున్నారు.

‘గామి’ ఎలాంటి చిత్రమో టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. వైవిధ్యం కోరుకునే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని తెలుసు. అలా వచ్చిన వాళ్లందరూ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యారు. ఐతే మూవీ ఇంకొంచెం బిగితో.. ఇంకా లాజికల్‌గా ఉంటే బాగుండేదని.. మరి కొన్ని హై మూమెంట్స్ ఉండాల్సిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఐతే ‘గామి’ టార్గెటెడ్ ఆడియన్స్‌కైతే సంతృప్తినిచ్చింది. కానీ ఎ-క్లాస్ ప్రేక్షకులు మాత్రమే చూస్తే సినిమాకు ఆశించిన ఫలితం దక్కలేదు. ‘ఎ’ సెంటర్ల వాళ్లే కాక అందరూ చూస్తేనే టీం పడ్డ కష్టానికి సరైన రిజల్ట్ వస్తుంది. రెండు రోజుల్లో రూ.15 కోట్ల వసూళ్లు వచ్చాయంటూ బి, సి సెంటర్లలోనూ స్పందన బాగుందనే అర్థం. కాకపోతే ఇలాంటి సినిమాలు వీకెండ్ తర్వాత ఆ సెంటర్లలో నిలబడడం కష్టం. పైగా ‘భీమా’ లాంటి ఊర మాస్‌ మూవీతో పోటీ ఉంది. ఎ సెంటర్లలో కూడా సోమవారం నుంచి సవాలు ఎదురవుతుంది. మరి ఆదివారం తర్వాత ‘గామి’ అన్ని సెంటర్లలోనూ నిలకడగా వసూళ్లు రాబడితే మంచి స్థాయిలో నిలబడబోతున్నట్లే.