అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు అని పాత సినిమా పాటలో చెప్పినట్టుగా రామ్ గోపాల్ వర్మ ఎంతో గొప్పలు పోయిన వ్యూహం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టడంతో శపథంని డైరెక్ట్ ఓటిటికి ఇచ్చేశారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ సర్కారు అధికారిక ముద్ర ఉన్న ఏపీ ఫైబర్ నెట్ యాప్ ద్వారా పే పర్ వ్యూ మోడల్ లో రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. దానికి వెబ్ సిరీస్ పేరు పెట్టి ఫస్ట్ పార్ట్ కి ఆరంభం, రెండో భాగానికి అంతం అని నామకరణం చేశారు. ఫ్రీగా ఇస్తేనే కష్టమనుకుంటే ఏకంగా డబ్బులు కట్టి ఆన్ లైన్ లో చూడమంటే ప్రేక్షకులు స్పందించడం అనుమానమే.
సెన్సార్ చిక్కులతో కాలయాపన చేయడం కంటే ఇలా ఓటిటి అయితే ఏ ఇబ్బంది ఉండదని వర్మ అనుకోవడం కొంత వరకు సహేతుకంగానే ఉన్నా వ్యూహంకొచ్చిన బ్రహ్మాండమైన రెస్పాన్స్ చూసి శపథం మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవడానికి లేదని స్పష్టంగా అర్థమై ఉంటుంది. కనీసం థియేటర్ అద్దెలు కిట్టుబాటు అయ్యే రేంజ్ లో వసూళ్లు వస్తే కనీసం ఒక వారం రోజులు ఏదోలా నెట్టుకురావొచ్చు. అలా కాకుండా సింగల్ డిజిట్ లో టికెట్లు అమ్ముడుపోయి ఎడాపెడా షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇంతకన్నా ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది.
అయినా సరే వర్మ దీన్ని కూడా గర్వంగానే చెప్పుకోవడం కొసమెరుపు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి ఈ సినిమాలు ఏమైనా ఉపయోగపడతాయేమోననే లెక్కలు పూర్తిగా తప్పాయి. ఓటర్లను ప్రభావితం చేయడంలో సినిమాల పాత్ర అందులోనూ స్పూఫ్ తరహాలో తీసే వాటికి ఎలాంటి ఆదరణ ఉండదని ఇంకోసారి క్లారిటీ వచ్చింది. అయినా ఏదైనా ఆలోచింపజేసేలానో లేదా సమస్యని సీరియస్ గా చెప్పడం ద్వారానో సినిమాలు చేస్తే బాగుటుంది కానీ ఇలా వ్యక్తిగత ఎజెండాతో తీస్తూ పోతే ఇవే ఫలితాలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే డబ్బులు అంటున్నారు కానీ తర్వాత ఫ్రీ అనేస్తారేమో.