కెరీర్లో చిరు ఎప్పుడూ చేయనిది

లాక్ డౌన్ టైంలో మెగాస్టార్ చిరంజీవి చాలా షాకులే ఇచ్చారు. తొలిసారి సోషల్ మీడియాలో అడుగు పెట్టారు. అందులో చాలా చురుగ్గా వ్యవహరించారు. రకరకాల వంటకాలు చేసి ఆశ్చర్యపరిచారు. ఈ మధ్యే ఆయన మీసం తీసి నయా లుక్‌లోకి మారడం మరో షాక్. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు ఏకంగా ‘గుండు’ లుక్‌తో దర్శనమిచ్చి విస్మయానికి గురి చేశారు.

మధ్యలో షూటింగుల్లేకపోవడంతో చిరు సరదాగా మీసం తీసినట్లు భావించారంతా. కానీ ఇంకొన్ని రోజుల్లో ‘ఆచార్య’ షూటింగ్ పున:ప్రారంభం కాబోతుండగా ఇలా గుండుతో దర్శనమివ్వడం షాక్‌కు గురి చేసింది అందరినీ. సోషల్ మీడియాలో ఆయన గుండు లుక్ నిమిషాల్లో వైరల్ అయిపోయింది. మెగా అభిమానులు చిరును ఎప్పుడైనా సరే ఇలాంటి లుక్‌లో చూస్తామని అసలు ఊహించలేదు.

నాలుగు దశాబ్దాల కెరీర్లో చిరు గుండుతో కనిపించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మీడియా హడావుడి లేనపుడు, తన మీద ఫోకస్ లేని కెరీర్ తొలి రోజుల్లో చిరు గుండు చేయించుకున్నారేమో తెలియదు కానీ.. ఆయన ఈ లుక్‌లో పబ్లిక్‌కు దర్శనమివ్వడం మాత్రం ఇదే తొలిసారి. చాలామంది హీరోల్లాగే ఆయన సినిమాల్లో మీసం తీయడానికి కూడా ఇష్టపడరు. ఒక్క ‘చంటబ్బాయి’ సినిమాలో మాత్రమే మీసం తీసి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత మరే సినిమాలోనూ చిరు మీసం కూడా తీయలేదు.

టాలీవుడ్ టాప్ స్టార్లు డీగ్లామరైజ్డ్‌‌గా కనిపించడం అనే కాన్సెప్టే ఉండేది కాదు ఒకప్పుడు. పాత్ర కోసం మన హీరోలు గుండు చేయించుకోవడం తెలుగులో అరుదు. కళ్యాణ్ రామ్ లాంటి వాళ్లు ఒకరిద్దరు తప్పితే గుండు జోలికే వెళ్లలేదు ఎవరూ. అలాంటిది ఇప్పుడు చిరు ఇలా జుట్టు తీసేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. మరి ఇది ‘ఆచార్య’ కోసమా.. లేక ‘వేదాలం’ రీమేక్ కోసమా.. లేక మామూలుగానే గుండు చేయించుకున్నారా అన్నది చూడాలి.