షణ్ముఖ్ డిప్రెషన్లో ఉన్నాడట

షణ్ముఖ్ జస్వంత్.. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ నటుడు. సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య లాంటి వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు సంపాదించి, బిగ్ బాస్ షోతో మరింతగా పాపులారిటీ సంపాదించిన ఈ కుర్రాడు.. తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. ఆ మధ్య మద్యం తాగి కారు నడిపి పోలీసులకు దొరకడం దుమారం రేపింది. తాజాగా అతను గంజాయితో దొరికిపోవడం సంచలనం రేపింది.

షణ్ముఖ్ సోదరుడు సోదరుడు సంపత్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు ఓ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడి ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్ గంజాయితో దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో అరెస్టయి.. బెయిల్ మీద బయటికి వచ్చాడు షణ్ముఖ్.

షణ్ముఖ్ ఫ్లాట్లో గంజాయి ఉన్నంత మాత్రాన అతను గంజాయి తీసుకున్నట్లు కాదు కదా అని అతడి టీం వాదిస్తోంది. ఈ కేసులో నిజా నిజాలేంటో పోలీసులు, కోర్టులు తేల్చాల్సి ఉంది. కాగా ఈలోపు షణ్ముఖ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షణ్ముఖ్ సోదరుడి ఫ్లాట్‌కు పోలీసులు వెళ్లినపుడు సోదాల్లో గంజాయి పట్టుబడగా.. ఆ సమయంలో లేడీ పోలీస్‌తో షణ్ముఖ్ ఏడుస్తూ మాట్లాడిన అస్పష్ట వీడియోలో.. తాను డిప్రెషన్లో ఉన్నట్లు షణ్ముఖ్ మాట్లాడడం వినిపించింది. తన పరిస్థితి ఏమీ బాగా లేదని.. డిప్రెషన్లో ఉన్న తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని అతను వ్యాఖ్యానించాడు. డిప్రెషన్లో ఉండడం వల్లే గంజాయి తీసుకోవడానికి సోదరుడి ఫ్లాట్‌కు వచ్చినట్లు షణ్ముఖ్ కవర్ చేయడానికి ప్రయత్నించినట్లుగా భావిస్తున్నారు. ఐతే డిప్రెషన్లో ఉంటే మానసిక వైద్యుల దగ్గరికి వెళ్లాలి కానీ.. గంజాయి తీసుకోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.