అనిరుధ్ కోసం దేవర ఎదురుచూపులు

ఇష్టం లేకపోయినా అనుకున్న టైంకి షూటింగ్ పూర్తి కాని కారణంగా ఏప్రిల్ 5 విడుదల తేదీని వదులుకున్న దేవర అక్టోబర్ 10కి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఖచ్చితంగా ఆ డేట్ కి కట్టుబడి ఉంటారా అంటే ఏమో చెప్పలేం. గత రెండు మూడేళ్ళలో ఏ ప్యాన్ ఇండియా సినిమా రెండు మూడు తేదీలు మార్చకుండా థియేటర్లలో అడుగు పెట్టలేదు. సో మార్పులు అనివార్యం. దేవర విషయంలో కొరటాల శివ టాకీ పార్ట్, విఎఫెక్స్ తాలూకు పనులను ఎప్పటికప్పుడు పూర్తయ్యేలా చూసుకున్నా పాటల విషయంలో మాత్రం వేగం చూపించలేదు. కారణం అనిరుద్ రవిచందరని వేరే చెప్పనక్కర్లేదు.

జాన్వీ కపూర్ సైతం ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. ఇటీవలే ఒక విదేశీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవర కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నానని, కొంత భాగంతో పాటు కొన్ని పాటలు పెండింగ్ ఉన్నాయని అవి కాగానే బయటికి వచ్చేయడమేనని చెప్పింది. ప్రత్యేకంగా ఈ సినిమా కోసమే తెలుగు నేర్చుకుంటున్న సంగతి కూడా పంచుకుంది. ఇక్క సమస్య ఏంటంటే అనిరుధ్ నుంచి బెస్ట్ అనిపించే ట్యూన్స్ రాబట్టుకోవడం. మాములుగా తమిళ దర్శకులు అతన్నుంచి ఎక్కువ ట్యూన్స్ డిమాండ్ చేయరు. ఇచ్చినవి బాగున్నాయని వెంటనే ఓకే చెప్పేస్తారు.

కానీ మన తెలుగు డైరెక్టర్ల వర్కింగ్ స్టైల్ వేరు. ఒక్కో పాటకు రెండు మూడు ఆప్షన్లు ఇస్తే వాటిని హీరోతో పాటు డిస్కస్ చేసుకుని బాగున్నది ఎంచుకుంటారు. ఈ తరహా మోడల్ అనిరుధ్ తో కష్టం. ఎందుకంటే చేతి నిండా సినిమాలతో ఒకే ప్రాజెక్టు మీద ఎక్కువ కాలం ఖర్చు పెట్టే పరిస్థితిలో లేడు. అందుకే కొరటాల శివ ఒత్తిడికి లోనవుతున్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా ఆయన దేవిశ్రీ ప్రసాద్, మణిశర్మలతో మాత్రమే పని చేశారు. కోలీవుడ్ టెక్నిషియన్స్ తో అనుభవం లేదు. మరి అనిరుధ్ తో అత్యుత్తమైన పాటలు రాబట్టుకోవడం పెను సవాలే. దాన్ని ఎలా దాటుకుంటారో చూడాలి.