విడ్డూరం.. శ్మశానంలో సినిమా ఫంక్షన్

ఈ రోజుల్లో చిన్న సినిమాలు జనాల దృష్టిలో పడాలంటే ప్రమోషన్ల పరంగా ఎంతో కొంత వైవిధ్యం చూపించాలి. జనాలు ఆశ్చర్యపోయేలా ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడో సినిమా బ‌ృందం ఎవ్వరూ ఊహించని రీతిలో పబ్లిసిటీకి రెడీ అయింది. తమ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్‌‌ను ఏకంగా శ్మశానంలో ఏర్పాటు చేసింది. ఆ చిత్రమే.. గీతాంజలి మళ్లీ వచ్చింది.

అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన ‘గీతాంజలి’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా చాలా ఏళ్ల తర్వాత సీక్వెల్ చేస్తున్నారు. తొలి భాగానికి కథ అందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించిన కోన వెంకటే ఈ చిత్రాన్ని కూడా ఎంవీవీ సత్యనారాయణతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. శివ తుర్లపాటి ఈ చిత్రానికి దర్శకుడు. అనౌన్స్‌మెంట్ తర్వాత ఈ సినిమా పెద్దగా వార్తల్లో లేదు.

ఐతే షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’కి ఇక ప్రమోషన్ మొదలుపెట్టాలని టీం నిర్ణయించింది. హార్రర్ సినిమా కాబట్టి అందుకు తగ్గట్లుగా శ్మశానంలో టీజర్ రిలీజ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పంజాగుట్టలోని శ్మశాన వాటికను ఇందుకు వేదికగా చేసుకున్నారు. ఈ మేరకు మీడియా వాళ్లకు కూడా ఆహ్వానాలు అందాయి.

శ్మశానంలో ఒక ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ ఏర్పాట్లు కూడా కొంచెం ఘనంగానే చేస్తున్నారట. మరి శ్మశానంలో జరిగే వేడుకకు చీఫ్ గెస్ట్‌గా ఎవరు వస్తారో చూడాలి. శ్మశానంలో టీజర్ రిలీజ్ అనగానే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడుతుంది. సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారడం ఖాయం. ఈ రకంగా సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చేలా టీం బాగానే ప్లాన్ చేసుకుంది.