తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి గాంజా శంకర్ టీమ్ నోటీసులు అందుకోవడం సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. టైటిల్ తో పాటు టీజర్ లో ఉన్న కంటెంట్ యువతను పెడదారి పట్టించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోందని, బాధ్యత కలిగిన ఫిలిం మేకర్స్ గా ఇలాంటివి ప్రోత్సహించకూడని బాధ్యత మీ మీద ఉందని సితార బ్యానర్ లో నిర్మాతలుగా వ్యవహరిస్తున్న వాళ్ళను ఉద్దేశించి పంపించిన నోటీసు సోషల్ మీడియాలోనూ వైరల్ టాపిక్ గా మారింది. సామజిక స్పృహ ఉండే కార్యక్రమాల్లో చురుకుగా ఉండే సాయి ధరమ్ తేజ్ హీరో కావడం ఫ్యాన్స్ కి టెన్షన్ కలిగించే విషయం.
నిజానికి బడ్జెట్ ఇష్యూస్ వల్ల గాంజా శంకర్ ఆగిపోయిందని నెల రోజుల క్రితమే టాక్ వచ్చింది. మీడియాలో ఈ వార్త ప్రముఖంగా కనిపించినా యూనిట్ స్పందించలేదు. పై పెచ్చు సంబంధం లేదన్నట్టుగా గాంజా శంకర్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడింది. గుంటూరు కారంకి ఇంటర్వ్యూలలో నాగవంశీ ఎక్కడా ఏ టాపిక్ తేలేదు. ఇప్పుడేమో ఈ ట్విస్ట్ వచ్చి పడింది. ఒకవేళ గాంజా శంకర్ క్యాన్సిల్ చేసుకున్న మాట వాస్తవమే అయితే అదేదో ముందే చెప్పేసి టీజర్ ని యూట్యూబ్ నుంచి డిలీట్ చేసుకుని ఉంటే ఇప్పుడీ సమస్య వచ్చేది కాదు. వివరణ ఇచ్చే బాధా తప్పేది.
కానీ ఇప్పుడు ఇవ్వక తప్పదు. సంపత్ నంది దర్శకత్వంలో అనౌన్స్ చేసిన గాంజా శంకర్ లో తేజు పాత్రను ఊర మాస్ గా గాంజాతో వ్యాపారం చేసే తరహాలో డిజైన్ చేసినట్టు ముందు నుంచి టాక్ ఉంది. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ చేసిన గుడుంబా శంకర్ ని స్ఫూర్తిగా తీసుకునే ఈ టైటిల్ పెట్టినట్టు అర్థమయ్యింది. పేరున్న నిర్మాణ సంస్థలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే హఠాత్తుగా జరిగే పరిణామాలకు జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. పూజా హెగ్డేని హీరోయిన్ గా అనుకున్నది ఈ సినిమా కోసమే. మరి టీమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.