కంగనా ఉందని సినిమా నుంచి తప్పుకున్న లెజెండ్

బాలీవుడ్ బడా బాబులపై కొన్నేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తోంది కంగనా రనౌత్. ఆమె చాలా ఓపెన్, బోల్డ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. తనకంటూ ఒక గుర్తింపు వచ్చాక ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడుతోంది. ఏం చేయాలనుకుంటే అది చేస్తోంది. ఐతే బాలీవుడ్ నెపోటిజం బ్యాచ్ మీద ఆమె పోరాటానికి సామాన్య జనం నుంచి కూడా మద్దతు వచ్చింది. కానీ కొన్నిసార్లు కంగనా శ్రుతి మించిపోయి ఈ మద్దతును పోగొట్టుకుంటున్న మాటా వాస్తవం. ఉదాహరణకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వ్యవహారంలో కంగనా తీరు ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. అతడి మృతిని తనకు నచ్చని వాళ్లను టార్గెట్ చేయడానికి ఉపయోగించుకుంటోందన్న విమర్శలు ఎదుర్కొందామె. సరైన ఆధారాలు లేకుండా కొందరిపై తీవ్ర ఆరోపణలు చేసింది. స్వయంగా సుశాంత్ కుటుంబ న్యాయవాది ఆమె తీరును తప్పుబట్టి.. తన ఆరోపణల్లో పస లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.

కంగనా వ్యవహారం ఒక దశ దాటాక న్యూసెన్స్ లాగే మారిపోయిందంటూ ఆమెను ఇంతకుముందు సపోర్ట్ చేసిన వాళ్లు కూడా విమర్శలు చేస్తుండటం గమనార్హం. అందులో నసీరుద్దీన్ షా కూడా ఒకరు. ఇప్పుడు ఒక ప్రముఖ టెక్నీషియన్ కంగనా రనౌత్ ఉందన్న కారణంతో ఓ సినిమా నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ వ్యక్తి మరెవరో కాదు.. సౌత్ ఇండియన్ లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కంగనా రనౌత్ నటిస్తోందని తెలిసి తాను చేయాల్సిన ఓ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆమెతో కలిసి పని చేయడం అంటే తనకు అన్ ఈజీగా అనిపించిందని.. అందుకే చిత్ర బృందానికి విషయం చెబితే వాళ్లు అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. కొన్నిసార్లు మనసుకు ఏది మంచిదనిపిస్తే అది చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. కంగనాతో నేరుగా శ్రీరామ్‌కు ఏ వివాదం లేకపోయినా.. ప్రతిదాన్నీ వివాదంగా మార్చే ఆమె తీరు నచ్చకే ఆయన తప్పుకున్నారన్నది స్పష్టం.