మొన్న శుక్రవారం విడుదలైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకి టాక్ డీసెంట్ గానే ఉంది. యూనిట్ అఫీషియల్ గా వదిలిన పోస్టర్ ప్రకారం వరల్డ్ వైడ్ గ్రాస్ ఎనిమిదిన్నర కోట్లు దాటేసింది. కానీ క్షేత్ర స్థాయిలో అంత దూకుడు లేదని, హైదరాబాద్ లాంటి ప్రధాన కేంద్రాలు మినహాయించి చాలా చోట్ల నెమ్మదిగా ఉందని ట్రేడ్ అంటోంది. సరే ఒకటి రెండు కోట్ల వ్యత్యాసం ఉందనుకున్నా టాక్ ఇంకా బలంగా వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఎక్కువ శాతం రీచ్ కావాలనే ఉద్దేశంతో రాబోయే రెండు మూడు రోజులు ప్రతి చోట ఉచితంగా ఒక స్పెషల్ షో వేయాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.
ఇదిలా ఉండగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో రంగస్థలం ఛాయలు చాలా ఉన్నాయనేది ముందు నుంచి వినిపిస్తున్న కామెంట్. సుహాస్, శరణ్య ప్రదీప్ పాత్రలు రామ్ చరణ్, ఆది పినిశెట్టిలను గుర్తుకు తెస్తుండగా విలన్ నితిన్ ప్రసన్నని జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ల కలబోతగా ఒకే క్యారెక్టర్ గా మార్చారని చాలా మంది అభిప్రాయపడ్డారు. క్లైమాక్స్ సైతం సుకుమార్ రచన చేసిన ఒక చిన్న సినిమాను గుర్తు చేసిందని ఎవరైనా ఒప్పుకునే నిజం. అయితే తమకు కథ విన్నప్పుడు అలా ఎప్పుడూ అనిపించలేదని, నిజాయితీగా ఒక ఎమోషనల్ డ్రామా చెప్పే ప్రయత్నం చేశామని ప్రొడ్యూసర్ మాట .
వీటి సంగతలా ఉంచితే పోలికలు కనిపించిన మాట వాస్తవమే. సుకుమార్ ప్రభావం అంతో ఇంతో కనిపిస్తుంది. కాకపోతే అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో కమర్షియల్ ఎలిమెంట్స్, ఐటెం సాంగ్, హీరో హీరోయిన్ డ్యూయెట్ లాంటివి లేకుండా స్ట్రెయిట్ గా పాయింట్ కే కట్టుబడిన విషయం ఒప్పుకోవాలి. కుల వివక్ష మీద వ్యతిరేకంగా బలమైన సందేశం ఇవ్వాలనే తాపత్రయం దర్శకుడిలో కనిపించింది. టీమ్ చెప్పిన ప్రకారం సుహాస్ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు ఇచ్చాడు. అవి ఏ స్థాయిలో, ఎంతెంత ఫిగర్స్ వచ్చాయనేది తేలాలంటే మాత్రం మొదటి వారం పూర్తయితే కానీ అంచనాకు రాలేం.