2025 సంక్రాంతికి ఇంకా ఏడాది సమయం ఉంది. మామూలుగా ఈ పండుగ సీజన్‌కు ఉండే క్రేజ్ దృష్ట్యా ఐదారు నెలల ముందే బెర్తులు బుక్ అవుతుంటాయి. కానీ ఈసారి విడ్డూరంగా మరీ ఏడాది ముందే సంక్రాంతి సినిమాల విడుదలను ఖరారు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘విశ్వంభర’కు అయితే జనవరి 10 అంటూ డేట్ కూడా ప్రకటించేశారు. మరోవైపు దిల్ రాజు ‘శతమానం భవతి’ సీక్వెల్‌తో వచ్చే సంక్రాంతికి రానున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ సినిమాలో నటీనటులెవరో.. ‘శతమానం భవతి’ తీసిన సతీశ్ వేగేశ్ననే డైరెక్ట్ చేస్తాడా ఇంకెవరైనా ఆ సినిమా చేస్తారా.. ఈ వివరాలేవీ తెలియవు. కానీ సంక్రాంతికి ఆ సినిమా అన్నది మాత్రం ఖరారైంది.
ఇంకోవైపు అక్కినేని నాగార్జున ‘నా సామిరంగ’ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. వచ్చే సంక్రాంతికి మళ్లీ కలుద్దాం అని పేర్కొనడం ద్వారా మళ్లీ తాను పండుగ బరిలో ఉంటానని చెప్పేశారు. ఆయన ఏ సినిమాతో సంక్రాంతికి వస్తాడన్న క్లారిటీ కూడా లేదు. దీన్ని బట్టి సంక్రాంతి కోసం ఎంత తొందరపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇంకో పెద్ద సినిమా సంక్రాంతి రిలీజ్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రభాస్-మారుతి కలయికలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ను 2025 సంక్రాంతికి తేవాలని చూస్తున్నారట. ముందు దసరా టైంకే అనుకున్నా అప్పటికి సినిమా రెడీ అయ్యేలా లేదట. సంక్రాంతి అయితేనే అన్ని రకాలుగా మంచిదన్న ఉద్దేశంతో ఆ డేట్ మీద దృష్టిసారించినట్లు సమాచారం.
మరోవైపు బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా.. వెంకటేష్-అనిల్ రావిపూడి కలయికలో మొదలు కానున్న చిత్రం కూడా సంక్రాంతిని టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే 2025 సంక్రాంతికి చాలా ముందుగానే హౌస్ ఫుల్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.