అవగాహన కోసం చావు మీద ప్రాంకులా

Poonam Pandey

నిన్న క్యాన్సర్ తో హీరోయిన్ పూనమ్ పాండే చనిపోయిందనే వార్త మీడియాలో హోరెత్తిపోయింది. దేశంలో ఉన్న అన్ని ఛానల్స్ లోనూ న్యూస్ హైలైట్ అయ్యింది. 32 ఏళ్ళ చిన్న వయసులో సర్వికల్ మహమ్మారితో పోరాడి ఓడిపోయిందని ఆమె టీమ్ అధికారికంగా ప్రకటించడంతో అందరూ నిజమేనని నమ్మారు. తీరా చూస్తే అబ్బే పూనమ్ బ్రతికే ఉంది, జబ్బు గురించి జనంలో అవగాహన రావాలని ఇలా ప్రాంక్ చేశామని స్వయంగా పూనమ్ వివరణ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకులతో పాటు మీడియా మొత్తం అవాక్కయ్యింది.

https://www.instagram.com/reel/C24C_LyIy6m/?igsh=MWlpN2U1NjZ6NTdweA==

ఉద్దేశం మంచిదే కానీ ఇలా మరీ చావు వార్తల మీద ప్రాంక్ చేయకూడదనేది ఒప్పుకోవాల్సిన నిజం. గతంలో ఎందరో సెలబ్రిటీలు ఇలాంటి ప్రాణాంతకమైన జబ్బులను ఎదిరించి గెలిచారు. మనీషా కొయిరాలా, లీసా రే, సోనాలి బెంద్రే, సంజయ్ దత్, రాకేష్ రోషన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టు ఉంది. క్రికెటర్ యువరాజ్ సింగ్ చావు అంచుల దాకా వెళ్లి విజేతగా నిలిచాడు. వీళ్ళందరూ తమ జబ్బుని దాచుకోలేదు. జనాలకు దాని గురించి వివరించి ఎలా గెలవాలో స్ఫూర్తి నింపారు. అంతే తప్ప మేం పోయామని ఫేక్ వార్తలు సృష్టించి గందరగోళం చేయలేదు.

పూనమ్ పాండే చేసిన పని గురించి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. తన పరిస్థితి పట్ల జాలి ఉంది కానీ ఇంకో మార్గం చూడాల్సి ఉందని అంటున్నారు. భవిషత్తులో ఎవరైనా నిజంగా పోతే వాళ్ళ చావు ఫోటోలు చూస్తే తప్ప నమ్మలేని పరిస్థితి రావొచ్చు. అది చాలా ప్రమాదం. ఏదైతేనేం మొత్తానికి ట్విట్టర్, ఇన్స్ టా తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో సర్వికల్ క్యాన్సర్ గురించి పెద్ద చర్చే జరిగింది. ఆ రకంగా ఈ మాజీ హీరోయిన్ లక్ష్యం నెరవేరినట్టే. కాకపోతే దీన్ని మళ్ళీ ఫాలో కాకపోతే మంచిది. లేదంటే పులి గురించి తండ్రికి అబద్దం చెప్పిన చిన్న పిల్లాడి కథ గుర్తొస్తుంది