అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. తెలుగు ప్రేక్షకుల దృష్టిని విడుదలకు ముందు బాగానే ఆకర్షించిన కొత్త సినిమా. సుహాస్ అనే చిన్న నటుడు లీడ్ రోల్ చేసినప్పటికీ.. ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. ముందు రోజు పెద్ద ఎత్తున పెయిడ్ ప్రిమియర్స్ వేస్తే అవన్నీ ఫుల్ అయిపోయాయి. వాటి నుంచి టాక్ కూడా బాగానే ఉంది. ఈ చిత్రంలో అందరు నటీనటులూ చక్కగా పెర్ఫామ్ చేశారు.
తెర మీద నటులను కాకుండా ఆయా పాత్రలను చూస్తున్నట్లే అనిపించింది. ఐతే సినిమాలో హీరో హీరోయిన్లు, విలన్ కంటే కూడా హైలైట్ అయింది హీరో అక్క పాత్ర. ఆ క్యారెక్టర్ చేసింది శరణ్య ప్రదీప్. ఈ పేరు చెబితే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు. ‘ఫిదా’లో సాయిపల్లవి అక్క పాత్రలో చేసిన అమ్మాయి అంటే.. ఎవరో తెలుస్తుంది.
‘ఫిదా’ తర్వాత క్యారెక్టర్ రోల్స్ చాలానే చేసింది శరణ్య. అవి ఆమెకు ఓ మోస్తరు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఐతే తన కెరీర్‌ను మలుపు తిప్పే, తన స్థాయిని పెంచే పాత్ర మాత్రం ‘అంబాజీపేట మ్యారేజిబ్యాండు’లోనే దక్కింది. ఇందులో ఆమె చేసిన పద్మ పాత్ర బాగా పేలింది. హీరో సుహాస్ చేసిన పాత్ర, తన పెర్ఫామెన్స్ కొత్తగా ఏమీ అనిపించవు. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్‌ల తరహాలోనే అమాయకంగా ఉంటుంది. కానీ ఆత్మాభిమానం కోసం పోరాడే పద్మ పాత్రలో శరణ్య చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది.
సినిమాలో ఆమెకు హీరోను మించిన ఎలివేషన్ దక్కింది. కథ ప్రధానంగా ఆమె చుట్టూనే తిరుగుతుంది. కొన్ని కీలకమైన ఎపిసోడ్లలో శరణ్య అద్భుతంగా నటించింది. సెకండాఫ్‌లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్లో అయితే తన పెర్ఫామెన్స్ మామూలుగా లేదు. ఆ సన్నివేశానికి థియేటర్లు హోరెత్తిపోతాయి. శరణ్యలో ఇంత మంచి నటి ఉందా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. ఈ సినిమా తర్వాత ఆమెకు మంచి మంచి అవకాశాలు వచ్చే ఛాన్సుంది.