ఇలా చేశావేంటి తమన్

Thaman

ఒకప్పుడు సంగీత దర్శకుడు తమన్ మీద సోషల్ మీడియాలో ఏ రేంజిలో ట్రోలింగ్ జరిగేదో అందరికీ తెలిసిందే. ఎక్కడెక్కడివో పాటల్నో తెలివిగా కాపీ కొట్టేయడం.. తన ట్యూన్లనే మళ్లీ మార్చి మార్చి కొట్టడం.. బ్యాగ్రౌండ్ స్కోర్‌ కూడా రొటీన్‌గా లాగించేయడం ద్వారా చాలా విమర్శలే ఎదుర్కొన్నాడు తమన్. అతడి మీద ‘కాపీ మాస్టర్’ ముద్ర వేసి ఆటాడుకునేవాళ్లు నెటిజన్లు.

ఈ విషయంలో కొన్నిసార్లు మీడియా ఇంటర్వ్యూల్లో తమన్ ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తారని.. తన ప్రమేయం లేకుండా కొన్ని పాటల్ని కాపీ కొట్టాల్సి వచ్చిందని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు అప్పట్లో.

ఐతే ఇలా ఎంత బుకాయించినా లాభం ఉండదు. సంగీతంలో వైవిధ్యం చూపిస్తే తప్ప విమర్శలు ఆగవు. గత రెండు మూడేళ్లలో తమన్ ఈ ప్రయత్నమే చేశాడు. ‘మహానుభావుడు’ దగ్గర్నుంచి ‘అల వైకుంఠపురములో’ వరకు కొన్ని మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు.

‘అల..’ పాటలు మార్మోగిపోవడంతో తమన్‌కు ఎక్కడలేని పేరొచ్చింది. దేవిశ్రీ ప్రసాద్‌ను వెనక్కి నెట్టి టాలీవుడ్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నాడు. అంతా బాగా నడుస్తోంది అనుకుంటుండగా అతను నేపథ్య సంగీతం సమకూర్చిన ‘వి’ చిత్రం నిన్న రాత్రి అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఐతే నాని పాత్ర పరిచయం దగ్గర బ్యాగ్రౌండ్ స్కోర్ వినగానే తమన్ అభిమానులు నీరుగారిపోయారు.

గత ఏడాది తమిళం నుంచి తెలుగులోకి రీమేక్ అయిన ‘రాక్షసుడు’ సినిమాలో బాగా పాపులర్ అయిన థీమ్ మ్యూజిక్‌ను యాజిటీజ్‌గా దించేశాడు తమన్. ఒకసారి పొరబాటున ఆ సౌండింగ్ వినిపించిందేమో అనుకుంటే.. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో ఆ థీమ్ వినిపించింది. సౌత్ ఇండియా అంతటా ‘రాక్షసుడు’ సినిమాను కోట్లాదిమంది చూశారు. ఆ థీమ్ మ్యూజిక్ బాగా పాపులర్ అయింది.

దాన్ని కాపీ కొట్టి తమన్ వాడేయడంతో ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నిన్న రాత్రి నుంచి తమన్‌ మీద ట్రోలింగ్ ఓ రేంజిలో నడుస్తోంది. ఒకప్పటి స్థాయిలో అతణ్ని ఆటాడుకున్నారు. కెరీర్లో ఎన్నడూ లేనంత గౌరవం సంపాదించుకున్న సమయంలో తమన్ ఇలా చేసి మళ్లీ వచ్చిన పేరంతా పోగొట్టుకుంటున్నాడు.