సంక్రాంతి సినిమాల విడుదల తేదీల గురించి నిర్మాతల మండలి జోక్యం చేసుకున్నప్పుడు సోలో రిలీజ్ ఇప్పిస్తామనే హామీతో రవితేజ ‘ఈగల్’ని ఫిబ్రవరి 9కి వెళ్లేలా ఒప్పించడం తెలిసిందే. అక్కడ ఆల్రెడీ టిల్లు స్క్వేర్ ఉండటంతో దాన్ని వాయిదా వేసుకునేందుకు దీంతో పాటు గుంటూరు కారంకి నిర్మాతైన నాగవంశీ ఒప్పుకోవడంతో సమస్య పరిష్కారమైనట్టే భావించారందరూ. తీరా చూస్తే అప్పటికే వారాల ముందు అదే డేట్ ని లాక్ చేసుకున్న ‘ఊరి పేరు భైరవకోన’ ప్రస్తావన ఎవరూ తేలేదు. అదే స్లాట్ లో ‘యాత్ర 2’ ఉన్న సంగతి మర్చిపోయారు. ఇవాళ ట్రైలర్ లాంఛ్ లో దీని ప్రస్తావన వచ్చింది.
సందీప్ కిషన్ ఈ ఇష్యూ గురించి స్పందిస్తూ ముందు తాము సంక్రాంతికి అనుకున్నామని, కానీ పోటీ ఎక్కువగా ఉండటం వల్ల ఫిబ్రవరి 9 శ్రేయస్కరంగా ఉంటుందని భావించి ఆ మేరకు ప్రకటన ఇచ్చామని వివరించాడు. ఈగల్ కు రూట్ క్లియర్ చేస్తామని చెప్పిన కౌన్సిల్ కనీసం తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకుంటే తామేం చేయగలమని, ముందు వెనక్కు జరపలేని నిస్సహాయ స్థితి వచ్చేసింది కాబట్టి క్లాష్ కావడం తప్ప మరో మార్గం లేదని క్లారిటీ ఇచ్చాడు. రవితేజతో తనకు, తమ దర్శకుడు, నిర్మాత అందరికీ మంచి బాండింగ్ ఉందని, కావాలని ఎవరూ ఏం చేయలేదని కుండబద్దలు కొట్టాడు.
సందీప్ కిషన్ మాటల్లో పూర్తి లాజిక్ ఉంది. ఎందుకంటే ఈగల్ ప్రెస్ మీట్ లో ఊరి పేరు భైరవకోన ప్రస్తావనే రాలేదు. టిల్లు స్క్వేర్ బృందాన్ని అడిగినట్టే వీళ్లతోనూ మాట్లాడి ఉంటే ఇంకో పరిష్కారం దొరికేదేమో. తీరా చూస్తే ఇప్పుడు ట్రయాంగిల్ క్లాష్ తప్పడం లేదు. ఈ రెండే కాదు రజినీకాంత్ ప్రత్యేక పాత్ర చేసిన లాల్ సలామ్ కూడా అదే డేట్ కి వస్తోంది. లైకా సంస్థ ప్రొడక్షన్ కాబట్టి డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ దొరుకుతుంది. ట్రైలర్ తో కంటెంట్ పరంగా అంచనాలు పెంచేసిన ఊరి పేరు భైరవకోన హిట్టు కొట్టడం మీద సందీప్ కిషన్, దర్శకుడు విఐ ఆనంద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.