కొన్ని సెంటిమెంట్లు వినడానికి విచిత్రంగా ఉన్నా వాటి ఫలితాలు మాత్రం ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. తమిళంలో కన్నా ఎక్కువగా తెలుగులో బిజీ అవుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు ఇక్కడ నటనకు స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. హీరోయిన్ కాకపోయినా కొన్నిసార్లు వాళ్ళను డామినేట్ చేసే స్థాయిలో స్క్రీన్ ప్రెజెన్స్ చూపిస్తోంది. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ సంచలనంగా నిలిచిన ‘హనుమాన్’లో తేజ సజ్జ అక్కయ్యగా తన పెర్ఫార్మన్స్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రీ క్లైమాక్స్ కి ముందు విలన్ వినయ్ రాయ్ చేతిలో హత్యకు గురయ్యాక మంచి ఎమోషన్ పండింది.
గత ఏడాది ‘వీరసింహారెడ్డి’లోనూ వరలక్ష్మికి కన్నుమూసే పాత్రే దక్కింది. బాలకృష్ణ చెల్లెలిగా ముందు నెగటివ్ షేడ్స్ తో మొదలై ఆపై తప్పు తెలుసుకుని చివరికి ఆత్మహత్య చేసుకునే సోదరిగా అందులో బెస్ట్ ఇచ్చింది. అంతకు ముందు రవితేజ ‘క్రాక్’లో సముతిరఖని సర్వస్వంగా పక్కనే ఉంటూ చివరికి అతని వల్లే హతమయ్యే జయమ్మగా అదరగొట్టింది. ఈ మూడు సినిమాలు సంక్రాంతికే రావడం మరో కాకతాళీయం. లెన్త్ సంగతి పక్కన పెడితే నటన పరంగా అన్నింటికి ప్లస్ గా నిలవడం గా గమనించాల్సిన విషయం. గత కొన్నేళ్లుగా వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో తనదైన ముద్ర బలంగా వేస్తోంది.
ఇది కాసేపు పక్కనపెడితే ఫలానా టైపు పాత్రలైతేనే చేస్తానని వరలక్ష్మి గిరి గీసుకోకపోవడం కెరీర్ గ్రాఫ్ పెంచుతోంది. విలన్ భార్య అయినా లేక ఏదైనా సపోర్టింగ్ రోల్ అయినా కథ నచ్చితే చాలు ఎస్ చెప్పేస్తోంది. కోట బొమ్మాళి పీఎస్, యశోద, నాంది, తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ ఇవన్నీ హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పేరు తెచ్చినవే. ప్రస్తుతం తనే టైటిల్ రోల్ పోషించిన శబరి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. బిజినెస్ తో పాటు సరైన డేట్ దొరక్కపోవడం వల్ల విడుదల లేటవుతోంది. చూస్తుంటే సంక్రాంతి సినిమాల్లో వరలక్ష్మి పాత్రను చంపేస్తే హిట్టు ఖాయమనిపిస్తోంది.