సంక్రాంతి రిలీజులు ఎవరు ముందు ప్రకటించారు, ఎవరు ఆలస్యంగా అనౌన్స్ చేశారనే కోణంలో కాకుండా క్యాస్టింగ్ ని బట్టి హనుమాన్ వెనక్కి తగ్గాలనే ఉద్దేశంతో జరిగిన ప్రచారాల పట్ల దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా క్లారిటీతో ఉన్నాడు. మా ప్రతినిథికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెరవెనుక జరిగిన వ్యవహారం గురించి స్పష్టతనిచ్చాడు. వాస్తవానికి ఆరు నెలలకంటే ముందు హనుమాన్ జనవరి 12 డేట్ ఫిక్స్ చేసుకుంది. దానికన్నా ముందు మే నెల అనుకున్నారు కానీ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో తర్వాత బెస్ట్ ఆప్షన్ గా పండగ కనిపించడంతో లాక్ చేసుకున్నారు. అంతే తప్ప కావాలని కాదు.
ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న హనుమాన్ కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే కాక మరో తొమ్మిది భాషల్లో డబ్ అవుతోంది. దీనికి సంబంధించిన బిజినెస్ లావాదేవీలు ఎప్పుడో పూర్తయ్యాయి. ఉత్తరాది ప్రమోషన్ల కోసం అక్కడి హక్కుదారులు ఇప్పటికే అయిదు కోట్లు ఖర్చు పెట్టేశారు. అందులో భాగంగానే పోస్టర్లు, స్టాండీలు దేశమంతా వెళ్లిపోయాయి. టీజర్, ట్రైలర్ వచ్చాక ప్రేక్షకులు హనుమాన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వెనక్కు తగ్గే పరిస్థితి లేదు. ఒక్కరి పెట్టుబడి మాత్రమే ఉంటే నిర్ణయాలు మార్చుకోవచ్చు. కానీ హనుమాన్ విషయంలో అది సాధ్యపడదు.
దిల్ రాజు ఇచ్చిన సూచనలు కూడా ప్రశాంత్ వర్మ పంచుకున్నారు. జనవరి 19, ఆపై గణతంత్రదినోత్సవం, తర్వాత ఫిబ్రవరి మొదటి వారం ఇలా ఏ డేట్ కు వెళ్లినా ఇప్పుడొచ్చే దానికన్నా ఎక్కువ రెవెన్యూ వస్తుందని ఆయన సలహా ఇచ్చారు. కానీ ఇది ఈగోతోనో పంతంతోనో తీసుకున్న డెసిషన్ కాదు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేని నిస్సహాయత మిగిలింది. పైగా సంక్రాంతికి కనీసం మూడు సినిమాలు బాగా ఆడతాయని ప్రతి ఏడాది ఋజువవుతూనే ఉంది. వెనక్కు వెళ్లే ఆప్షన్ లేదని ప్రశాంత్ వర్మ చెప్పడంలో లాజిక్ ఉంది. సో ఫైనల్ గా అయిదు సినిమాల మధ్య రసవత్తరమైన పోటీ జరగబోతోంది.